Corona Virus: తండ్రికి జాగ్రత్తలు చెప్పి కరోనాతో కన్నుమూసిన తనయుడు

  • కరోనా పరీక్షలు చేయకుండా తిప్పించుకున్న సిబ్బంది
  • చికిత్స కోసం ఆరు ఆసుపత్రుల చుట్టూ తిరిగిన వైనం
  • చివరికి పరిస్థితి విషమించి మృత్యువాత
Man died with corona in Hyderabad after talking to father

హైదరాబాద్‌లోని మల్లాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి (40) కరోనా చికిత్స పొందుతూ మంగవారం అర్ధరాత్రి మృతి చెందాడు. అయితే, అతడు చివరి శ్వాస తీసుకోవడానికి ముందు తండ్రితో చెప్పిన మాటలు అందరితో కంటతడి పెట్టిస్తున్నాయి. జ్వరం, దగ్గుతో బాధపడుతున్న బాధిత వ్యక్తి ఈ నెల 1న మల్లాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు.

అయితే, రెండు రోజులైనా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో కరోనా అనుమానంతో పరీక్షలు చేయించుకునేందుకు ఈనెల 3న నాచారం ఈఎస్ఐ ఆసుపత్రికి వెళ్లాడు. అయితే,  ఆధార్ కార్డు లేదన్న కారణంతో అతడిని వెనక్కి పంపారు. ఆ తర్వాతి రోజు ఆధార్ కార్డు తీసుకుని వెళ్లగా రోజుకు 50 మందికి మాత్రమే చేస్తున్నామని చెప్పడంతో ఉసూరుమంటూ వెనుదిరిగాడు. దీంతో ఆరో తేదీన సికింద్రాబాద్‌లోని మూడు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లగా పడకలు లేవంటూ చేర్చుకునేందుకు నిరాకరించారు. చివరికి అదే రోజు సాయంత్రం ఎల్‌బీనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు.

అంతా బాగుందనుకుంటున్న సమయంలో వెంటనే ఐసీయూకు తరలించాలని ఆ తర్వాతి రోజు ఉదయం వైద్యులు తెలిపారు. అయితే, రెండు గంటల తర్వాత ఆక్సిజన్ సౌకర్యం లేదని, మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో కుటుంబ సభ్యులు హతాశులయ్యారు. మంగళవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో ఊపిరితిత్తుల సమస్య ఎక్కువ కావడంతో మరణించినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆ తర్వాతి రోజు వచ్చిన కరోనా పరీక్షల్లో బాధిత వ్యక్తికి, అతడి తండ్రికి, మరొక బంధువుకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.

కాగా, బాధిత వ్యక్తి మృతి చెందడానికి ముందు తండ్రితో మాట్లాడుతూ.. తనకు చాలా దాహంగా ఉందని, ఊపిరి తీసుకోవడం కష్టమవుతోందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. పరిస్థితి చేయి దాటిపోయినట్టు తనకు అర్థమవుతోందని, మీరు ఇంటికి వెళ్లాలని, అమ్మ జాగ్రత్త అని చెప్పాడు. ఆ తర్వాత కొన్ని గంటలకే అతడు కన్నుమూశాడు.

More Telugu News