ఏపీలో కరోనా బారినపడిన మరో ఎమ్మెల్యే.. కోవిడ్ సెంటర్‌లో చేరిక

09-07-2020 Thu 08:12
  • పలు ప్రజాకార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
  • నిన్న సాయంత్రం కోవిడ్ కేంద్రంలో చేరిక
  • ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
Nellore MLA Infected to covid

కరోనా వైరస్ బారినపడుతున్న ప్రజా ప్రతినిధుల సంఖ్య ఇటీవల బాగా పెరుగుతోంది. తాజాగా, ఏపీలో మరో ఎమ్మెల్యే కరోనా మహమ్మారి బారినపడ్డారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆయనకు కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో నిన్న సాయంత్రం ఏడున్నర గంటల సమయంలో జిల్లా కొవిడ్ సెంటర్‌లో చేరారు. నెల్లూరులో ఇటీవల కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేకు ఆ సమయంలోనే కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.  

మరోవైపు, రాష్ట్రంలో కరోనా మహమ్మారికి అడ్డుకట్ట పడడం లేదు. రాష్ట్రంలో ప్రతి రోజూ వెయ్యికిపైగా కేసులు నమోదవుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. నిన్న ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 1,062 కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య  22,259కి చేరుకుంది.