మహేశ్ కోసం స్క్రిప్టు తయారుచేస్తున్న రాజమౌళి

08-07-2020 Wed 21:45
  • రాజమౌళి దర్శకత్వంలో తొలిసారిగా మహేశ్ 
  • లాక్ డౌన్ సమయంలో స్క్రిప్టు పని
  • 'సర్కారు వారి పాట' తర్వాత సెట్స్ కు
Rajamouli busy in preparing script for Mahesh

రాజమౌళి దర్శకత్వంలో తమ అభిమాన నటుడు ఓ సినిమా చేస్తే చూడాలన్న కోరికతో మహేశ్ బాబు అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే మహేశ్ తో తాను ఓ చిత్రం చేస్తున్నట్టు రాజమౌళి ప్రకటించడం విదితమే. ప్రస్తుతం ఎన్టీఆర్, చరణ్ లతో రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' భారీ ప్రాజక్టును చేస్తున్నారు. లాక్ డౌన్ వల్ల దీని షూటింగ్ అప్సెట్ అయింది. దాంతో దీని నిర్మాణం పూర్తవడంలో జాప్యం జరుగుతోంది. షూటింగుకి ఏర్పాట్లు జరుగుతున్నా, ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. రాజమౌళి ఇప్పుడు మహేశ్ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు పనిపై కూర్చున్నట్టు తాజా సమాచారం. మహేశ్ ఇమేజ్ కి తగ్గా స్టోరీ లైన్ ఇప్పటికే రాజమౌళి అనుకున్నప్పటికీ, దానికి ఇప్పుడు ఓ తుది రూపాన్ని ఇస్తున్నట్టు చెబుతున్నారు. రాజమౌళి 'ఆర్ఆర్ఆర్', మహేశ్ చేస్తున్న 'సర్కారు వారి పాట' చిత్రాలు పూర్తయ్యాక ఈ భారీ ప్రాజక్టు సెట్స్ కి వెళుతుంది. పాన్ ఇండియా చిత్రంగా నిర్మించే ఈ చిత్రంలో మహేశ్ ని రాజమౌళి ఎటువంటి పాత్రలో చూపిస్తాడన్నది ఆసక్తికరం!