Kishan Reddy: తెలంగాణలో కరోనా తీవ్రంగా ఉంది... సాయం చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది: కిషన్ రెడ్డి

  • రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై కిషన్ రెడ్డి ఆందోళన
  • కేంద్ర ఆరోగ్యమంత్రితో భేటీ
  • కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారన్న కిషన్ రెడ్డి
Kishan Reddy meets Union Health Minister Dr Harshvardhan

తెలంగాణలో కరోనా పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయంటూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ కిషన్ రెడ్డి కేంద్ర ఆరోగ్యమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ని కలిశారు. తెలంగాణలో కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై ఆయనతో చర్చించారు. దీనిపై కిషన్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని తెలిపారు. హైదరాబాద్ ప్రజల ఆందోళనను కేంద్ర ఆరోగ్యమంత్రికి వివరించానని వెల్లడించారు. తెలంగాణకు అన్నివిధాలా సాయం చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. అవసరమైన వైద్య బృందాలను పంపేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు.

కేంద్రం ఇప్పటికే 2.41 లక్షల పీపీఈ కిట్లను, 7.14 లక్షల ఎన్-95 మాస్కులను తెలంగాణకు పంపిందని కిషన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో వెంటిలేటర్ల కొరతపై కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లానని, 1220 వెంటిలేటర్లు ఇస్తున్నట్టు చెప్పారని తెలిపారు. కరోనా కట్టడికి కేంద్రం తెలంగాణకు రూ.215 కోట్లు ఇచ్చిందని వెల్లడించారు. కరోనా వ్యాప్తిపై మాట్లాడుతూ, తెలంగాణలో యుద్ధ ప్రాతిపదికన కరోనా టెస్టులు చేయాలని అన్నారు. కేసుల సంఖ్య, మృతుల సంఖ్య ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.

More Telugu News