తీవ్ర అస్వస్థతతో వెంటిలేటర్ పై సీనియర్ నటి జయంతి

08-07-2020 Wed 17:23
  • బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స
  • మూడున్నర దశాబ్దాలుగా ఉబ్బసంతో బాధపడుతున్న జయంతి
  • జయంతి ఆరోగ్యం నిలకడగానే ఉందన్న కుమారుడు
Senior actress Jayanthi on ventilator

తెలుగు, తమిళం, కన్నడ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి జయంతి ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ఆమె గత మూడున్నర దశాబ్దాలుగా ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్నారు.

అయితే, నిన్న అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవడంతో కుటుంబ సభ్యులు జయంతిని బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు వెంటిలేటర్ అమర్చారు. అయితే, జయంతి బాధపడుతున్న లక్షణాలను పరిగణనలోకి తీసుకున్న వైద్యులు కరోనా పరీక్షలు చేయించినట్టు తెలుస్తోంది.

ఈ పరీక్షల్లో ఆమెకు నెగెటివ్ వచ్చినట్టు సమాచారం. జయంతి తనయుడు కృష్ణకుమార్ మాట్లాడుతూ, ప్రస్తుతం తన తల్లి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆమె కోలుకుంటున్నారని వెల్లడించారు.