KTR: గాలిని కూడా కొనుక్కునే రోజులు వచ్చే ప్రమాదం ఉంది: కేటీఆర్

  • అడవులను 33 శాతానికి పెంచడమే హరితహారం లక్ష్యం
  • ఇప్పటి వరకు 180 కోట్లకు పైగా మొక్కలను నాటాం
  • కరోనా సంక్షోభ సమయంలో కూడా సంక్షేమ పథకాలను ఆపలేదు
We may buy air in future says KTR

రాష్ట్రంలోని అడవులను 33 శాతానికి పెంచడమే లక్ష్యంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు. 10 శాతం బడ్జెట్ ను హరితహారం కార్యక్రమానికి కేటాయించిన ఏకైక సీఎం కేసీఆర్ అని కితాబునిచ్చారు. ఇప్పటి వరకు 180 కోట్లకు పైగా మొక్కలను నాటామని చెప్పారు. ఈ కార్యక్రమం వల్ల ఎలాంటి రాజకీయ లాభం ఉండదని, భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుందని అన్నారు. చెట్లను కాపాడుకోలేకపోతే... రాబోయే రోజుల్లో గాలిని కూడా కొనుక్కునే రోజులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

హరితహారంలో భాగంగా కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగుట్ట గ్రామంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తో కలిసి కేటీఆర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇంత పెద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ చెప్పారు. గ్రామాల్లో నాటిన మొక్కల్లో 85 శాతం బతకకపోతే... గ్రామ సర్పంచ్ పదవి పోయేలా పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు.

కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని చెప్పారు. అన్ని సంక్షేమ కార్యక్రమాలను ఆపకుండా చేస్తున్నామని అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో కూడా పథకాలు ఆగలేదని చెప్పారు. కరీంనగర్ జిల్లాలో అడవుల శాతం తక్కువ ఉందన్నారు... ప్రతి గ్రామంలో మంకీ ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేశామని తెలిపారు.

More Telugu News