నాపై రఘురామకృష్ణరాజు అసత్య ప్రచారం చేస్తున్నారు.. పోలీసులకు ఫిర్యాదు చేశా!: ఏపీ మంత్రి శ్రీరంగనాథ రాజు

08-07-2020 Wed 12:49
  • రఘురామకృష్ణరాజు వ్యక్తిగతంగా దూషిస్తున్నారు
  • ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదు
  • నా దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు
  • నా పరువుకు భంగం కలిగించాలని చూస్తున్నారు
ap minister gives police complaint against raghurama krishna raju

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తనపై అతస్య ప్రచారం చేస్తున్నారని, ఆయన తన గురించి చేస్తోన్న ఆరోపణలపై విచారణ జరిపించాలని ఏపీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు కోరారు. తనను, తన కుమారుడిని రఘురామకృష్ణరాజు వ్యక్తిగతంగా దూషిస్తున్నారని చెప్పారు. తమని దొంగలు అంటూ ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారని, పందులే గుంపులుగా వస్తాయి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదని మండిపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి తాను ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడిన అనంతరం రఘురామకృష్ణ రాజు ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పారు.

తనపై  అవాస్తవాలు ప్రచారం చేస్తోన్న రఘురామకృష్ణరాజు మద్దతుదారులు తన దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారని ఆయన చెప్పారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఎదుటి వారి వ్యక్తిత్వంపై దాడి చేయడమేంటని ఆయన నిలదీశారు. పదే పదే అసత్యాలు చెప్పి అసత్యాన్ని నిజం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.

ఈ వివాదంపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిజాలు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. తాను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తినని,  చట్టాలను గౌరవిస్తానని, అందుకే న్యాయం కోసం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని చెప్పుకొచ్చారు. అసత్య ఆరోపణలు చేస్తూ ఆయన తన పరువుకు భంగం కలిగించాలని చూస్తున్నారని విమర్శించారు.