ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ ను మించిన జననేత మరొకరు లేరు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

08-07-2020 Wed 12:34
  • పంజాగుట్టలో వైఎస్ విగ్రహానికి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నేతలు
  • వైఎస్ చెరగని ముద్రవేశారన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • ఆయన సేవలు చిరస్మరణీయం అని వ్యాఖ్యలు
Uttam Kumar Reddy praises former CM YS Rajasekhar Reddy

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా హైదరాబాద్ పంజాగుట్టలోని ఆయన విగ్రహానికి కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ ను మించిన జననేత ఇంకెవరూ లేరని కీర్తించారు.

ఆయన తీసుకువచ్చిన పథకాలు ఇప్పటికీ నిలిచే ఉన్నాయని, దేశవ్యాప్తంగా ఆ పథకాలను అనుసరిస్తున్నారని వివరించారు. అన్ని వర్గాల ప్రజలపై చెరగని ముద్ర వేయడం వైఎస్ కే సాధ్యమైందని కొనియాడారు. యువత, రైతులు, విద్యార్థులు, మహిళల అభ్యున్నతికి ఉపకరించేలా ఆయన సేవలు చిరస్మరణీయం అని తెలిపారు. కాగా, వైఎస్ కు నివాళులు అర్పించినవారిలో కేవీపీ రామచంద్రరావు, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య, అంజన్ కుమార్ యాదవ్ తదితరులున్నారు.