XRay: వెబ్ సైట్ లో ఛాతీ ఎక్స్ రే అప్ లోడ్ చేస్తే కరోనా ఉందో లేదో తెలిసిపోతుందంటున్న ఐఐటీ నిపుణుడు

  • ప్రొఫెసర్ కృష్ణప్రసాద్ నేతృత్వంలో గాంధీనగర్ ఐఐటీ పరిశోధన
  • ప్రత్యేక సాఫ్ట్ వేర్ కు కృత్రిమ మేధను జోడించిన నిపుణులు
  • ఈ సేవలను ఎవరైనా ఉపయోగించుకోవచ్చని వెల్లడి
New technology to identify corona through xray

కరోనా మహమ్మారి వైరస్ ఈ ప్రపంచంపై దండయాత్ర మొదలుపెట్టి కొన్ని నెలలే కావడంతో దీనికంటూ ప్రత్యేకంగా నిర్ధారణ విధానాలు కానీ, ప్రత్యేక ఔషధాలు కానీ లేవు. అందుబాటులో ఉన్న మందులు, చికిత్స విధానాలతో దీన్ని ఎదుర్కొంటున్నారు. వైరస్ నిర్ధారణ కూడా ఇప్పటికే అమల్లో ఉన్న పద్ధతుల్లో చేస్తున్నారు. ఈ క్రమంలో గాంధీ నగర్ ఐఐటీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న కృష్ణప్రసాద్ ఓ ఆసక్తికర ఆవిష్కరణ చేశారు. ప్రొఫెసర్ కృష్ణప్రసాద్ నేతృత్వంలో ఐఐటీ పరిశోధకుల బృందం సరికొత్త సాఫ్ట్ వేర్ కు రూపకల్పన చేసింది.

కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో పనిచేసే ఈ సాఫ్ట్ వేర్... ఛాతీ ఎక్స్ రేలను పరిశీలించి కరోనా ఉందో లేదో గుర్తిస్తుంది. ఈ సాఫ్ట్ వేర్ ను పొందుపరిచి కృష్ణప్రసాద్ బృందం ఓ వెబ్ సైట్ (http://covidxray.iitgn.ac.in) రూపొందించింది. ఈ వెబ్ సైట్ లో ఛాతీ ఎక్స్ రేని అప్ లోడ్ చేస్తే చాలు... దీంట్లో సాఫ్ట్ వేర్ కృత్రిమ మేధ సాయంతో ఆ ఎక్స్ రేని విశ్లేషించి కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తిస్తుంది.

ఈ వెబ్ సైట్ సేవలను ఎవరైనా ఉపయోగించుకోవచ్చని ప్రొఫెసర్ కృష్ణప్రసాద్ వెల్లడించారు. ప్రాథమికంగా కరోనా సోకిందా లేదా అనేదానిపై ఓ నిర్ధారణకు రావొచ్చని వివరించారు. ప్రొఫెసర్ కృష్ణప్రసాద్ హైదరాబాద్ కు చెందిన వ్యక్తి.

More Telugu News