YS Vijayamma: ఇడుపులపాయలో వైఎస్సార్ కు జగన్ నివాళులు.. విజయమ్మ పుస్తకం ఆవిష్కరణ

  • విజయమ్మ రాసిన 'నాలో.. నాతో వైఎస్సార్' పుస్తక ఆవిష్కరణ
  • 33 ఏళ్లు ఆయనతో కలిసి జీవించానన్న విజయమ్మ 
  • నేను ఆయనలో చూసిన మంచితనం గురించి రాశాను
  • ఆయన చెప్పిన మాటల ఆధారంగా ఈ పుస్తకం రాశాను
ys vijayamma abou her book on ysr

మాజీ సీఎం దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌  వద్ద ఆయనకు కుటుంబసభ్యులు ఈ రోజు నివాళులు అర్పించారు. వైఎస్‌ జగన్‌తో పాటు విజయమ్మ, భారతి,‌ షర్మిల, అనిల్‌ కుమార్‌, ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయమ్మ రాసిన 'నాలో.. నాతో వైఎస్సార్' పుస్తకాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ... '33 ఏళ్లు ఆయనతో కలిసి జీవించిన సమయంలో నేను ఆయనలో చూసిన మంచితనం, ఆయన చెప్పిన మాటల ఆధారంగా ఈ పుస్తకం రాశాను. ఆయన గురించి రాయాలని నాకు అనిపించింది. ఆయనలో మూర్తీభవించిన మానవత్వం గురించి, ఆయన మాటకు ఇచ్చే విలువ గురించి రాయాలనిపించింది. ఎంతో మంది జీవితాలకు ఆయన వెలుగునిచ్చారు.

ఈ అంశాలన్నీ ఆయనలో చూశాను.. ఆయన ప్రత్యర్థులు కూడా ఆయన జీవితం గురించి పూర్తిగా తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. ఆయన ప్రతి మాట, ప్రతి అడుగు గురించి చాలా మంది తెలుసుకోవాల్సి ఉంది. ఎందుకంటే నా కొడుకు, కోడలు.. కూతురు, అల్లుడు ప్రతి సమయంలో, ప్రతి పరిస్థితుల్లో వైఎస్సార్‌ మాటలను గుర్తు తెచ్చుకుని వాటి స్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటుంటారు. ప్రతి ఒక్కరు ఈ పుస్తకం చదివి వారు కూడా వైఎస్సార్ స్ఫూర్తిని కొనసాగిస్తారని భావిస్తూ నేను ఈ పుస్తకం రాశాను' అని విజయమ్మ తెలిపారు.

More Telugu News