పోలీసుల కన్నుగప్పి.. మరోమారు తప్పించుకున్న మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ వికాశ్ దూబే

08-07-2020 Wed 08:21
  • కాన్పూరు నుంచి తప్పించుకుని హోటల్‌లో మకాం
  • హోటల్‌పై ప్రత్యేక పోలీసు బృందం దాడి
  • అతడి అనుచరుడి అరెస్ట్.. హోటల్ సిబ్బందిని ప్రశ్నిస్తున్న పోలీసులు
Gangster Vikas Dubey Once again escaped

ఉత్తరప్రదేశ్  పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా మారిన గ్యాంగ్‌స్టర్ వికాశ్ దూబే ఫరీదాబాద్ హోటల్ నుంచి తప్పించుకున్నాడు. 8 మంది పోలీసులను హతమార్చిన తర్వాత తప్పించుకు తిరుగుతున్న దూబే.. ఫరీదాబాద్‌లోని బద్కల్ చౌక్ ప్రాంతంలో ఉన్న ఓ హోటల్‌లో దాక్కున్నట్టు స్థానిక పోలీసులకు సమాచారం అందింది.

దీంతో రంగంలోకి దిగిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల బృందం దూబేను పట్టుకునేందుకు హోటల్‌పై దాడిచేసింది. అయితే, అప్పటికే అతను హోటల్ నుంచి తప్పించుకున్నాడు. దూబేతో కలిసి ఉన్న అనుచరుడు మాత్రం పోలీసులకు చిక్కాడు. హోటల్ యజమానితోపాటు సిబ్బందిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రికార్డులను సీజ్ చేసి అతడి మకాం గురించి ఆరా తీస్తున్నారు. కాగా, గ్యాంగ్‌స్టర్ కోసం ప్రత్యేక బృందాలు వంద ప్రాంతాల్లో గాలిస్తున్నాయి.