ప్రధాని కార్యాలయం కీలక అడుగులు.. చైనా దిగుమతులను తగ్గించుకోవడంపై కసరత్తు ప్రారంభం

07-07-2020 Tue 18:09
  • ఇప్పటికే 59 చైనా యాప్ లను నిషేధించిన భారత్
  • దిగుమతులపై దృష్టిని సారించిన కేంద్రం
  • చైనాపై మరింత ఒత్తిడిని పెంచేందుకు సిద్ధమవుతున్న భారత్
PMO seeks suggestions from Commerce Ministry on curbing Chinese imports

సరిహద్దుల్లో ఉద్రిక్తతలను రెచ్చగొడుతూ, మన 21 మంది జవాన్ల ప్రాణాలను బలిగొన్న చైనాపై భారత ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఇప్పటికే ఆ దేశానికి చెందిన 59 యాప్ లను నిషేధించి షాకిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ దేశ దిగుమతులపై కూడా ప్రస్తుతం దృష్టిని సారించింది. చైనా దిగుమతులపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో సూచనలు ఇవ్వాలని కేంద్ర వాణిజ్యశాఖను ప్రధాని కార్యాలయం ఆదేశించింది. చైనాపై మరింత ఒత్తిడిని పెంచేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం... చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులలో వేటిని తగ్గించవచ్చో తెలపాలని వాణిజ్యశాఖను పీఎంఓ ఆదేశించింది. ఇదే సమయంలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్టీఏ)పై కూడా ప్రధాని సమీక్ష నిర్వహించినట్టు సమాచారం. చైనా నుంచి దిగుమతి అవుతున్న చీప్ గూడ్స్ ను నియంత్రించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. స్వయంసమృద్ధిని సాధించిన దేశంగా ఎదిగే క్రమంలో... ఇతర దేశాల నుంచి దిగుమతులను తగ్గించుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఆసియాన్ కూటమిలోని దేశాలు, దక్షిణకొరియా, మలేషియా, సింగపూర్ తదితర దేశాల నుంచి కూడా దిగుమతులును తగ్గించుకోవాలని భావిస్తోంది.