అమెరికా సంచలన నిర్ణయం... ఆన్ లైన్ క్లాస్ లను ఎంచుకున్న వారు దేశం వీడాల్సిందే!

07-07-2020 Tue 10:09
  • ఆదేశాలు జారీ చేసిన ఐసీఈ
  • ఎఫ్-1, ఎం-1 విద్యార్థులకు అశనిపాతం
  • హార్వార్డ్ సహా పలు వర్శిటీల్లో ఆన్ లైన్ క్లాసులు మాత్రమే
Ys Said Students to Depart if Online Classes Choosen

అమెరికాలో ఉన్నత విద్యకై వెళ్లి, కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ మాధ్యమంగా తరగతులకు హాజరయ్యేవారు తప్పనిసరిగా దేశాన్ని వీడి వెళ్లాల్సిందేనని అమెరికా సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఆన్ లైన్ క్లాసులను ఎంచుకున్నవారిని దేశంలో ఉండనిచ్చే అవకాశాలు లేవని యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది.

"నాన్ ఇమిగ్రెంట్ ఎఫ్-1, ఎం-1 విద్యార్థులు, స్కూళ్లకు తప్పనిసరిగా హాజరుకావాలి. ఆన్ లైన్ క్లాసులకు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసిన విద్యార్థులు వెళ్లిపోవాలి" అని ఐసీఈ ఆదేశించింది. నిబంధనలను పాటించని విద్యార్థులు, తమ స్వదేశాలకు తిరిగి వెళ్లకుంటే, వారిపై చట్టపరమైన ఇమిగ్రేషన్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది.

 "పూర్తి ఆన్ లైన్ కోర్సులను నిర్వహిస్తున్న స్కూళ్లలో తమ పేర్లను నమోదు చేసుకున్న వారిని ఎవరినీ దేశంలో ఉండనిచ్చేది లేదు. ఈ తరహా వీసాలను తీసుకున్నా, వారిని యూఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ విభాగం దేశంలోకి అనుమతించదు" అని కూడా వెల్లడించింది.

కాగా, ఇప్పటివరకూ చాలా అమెరికన్ కాలేజీలు, యూనివర్శిటీలు రాబోయే సెమిస్టర్ పై తమ ప్రణాళికలను వెల్లడించలేదు. అయితే, హార్వార్డ్ వంటి ప్రముఖ వర్శిటీలు కొన్ని, ఈ సంవత్సరం వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని అన్ని క్లాసులనూ ఆన్ లైన్ మాధ్యమంగానే నిర్వహిస్తామని ప్రకటించాయి. ఇదే సమయంలో కేవలం 40 శాతం స్టూడెంట్లను మాత్రమే క్యాంపస్ లో ఉండనిస్తామని హార్వార్డ్ స్పష్టం చేసింది. దీంతో ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది.

2018-19 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10 లక్షల మందికి పైగా విదేశీ విద్యార్థులు యూఎస్ లో విద్యాభ్యాసం కోసం దరఖాస్తు చేసుకుని, ప్రభుత్వ అనుమతితో అక్కడ చదువుకున్నారు. ఈ సంవత్సరం ఈ సంఖ్య మరో రెండు లక్షల వరకూ పెరగవచ్చని అంచనా వేయగా, మహమ్మారి వైరస్ అడ్డుకుంది. అమెరికాలో చదువుకునే విద్యార్థుల్లో అత్యధికులు చైనా వారు కాగా, ఆ తరువాతి స్థానంలో ఇండియా, సౌత్ కొరియా, సౌదీ అరేబియా, కెనడా విద్యార్థులు ఉంటారు.