వెబ్ సీరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన త్రిష!

06-07-2020 Mon 21:38
  • వెబ్ సీరీస్ కి మొగ్గు చూపుతున్న హీరోయిన్లు  
  • ఇప్పటికే చేస్తున్న కాజల్, సమంత 
  • ఆనంద వికటన్ నిర్మించే వెబ్ సీరీస్ లో త్రిష 
Trisha gives nod for web series
లాక్ డౌన్ అన్నది చాలామంది సినిమా వాళ్ల ఆలోచనా ధోరణిని మార్చేసింది. అంతవరకూ ఓటీటీ పట్ల కాస్త చిన్న చూపు చూసిన పెద్ద తారలు, దర్శకులు సైతం ఇప్పుడు దాని విలువ తెలుసుకున్నారు. థియేటర్లకు ప్రత్యామ్నాయంగా ఓటీటీ వేదికలు నిలుస్తున్న నేపథ్యంలో చాలామంది అటువైపు మెల్లగా మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో వెబ్ సీరీస్ కు మంచి క్రేజ్ పెరుగుతోంది. పారితోషికం కూడా సంతృప్తికరంగా, ఆకర్షణీయంగా ఉండడంతో చాలామంది హీరోయిన్లు వెబ్ సీరీస్ లో నటించడానికి ముందుకు వస్తున్నారు.

ఇప్పటికే కాజల్, సమంత వంటి బిజీ తారలు సైతం వెబ్ సీరీస్ లో నటిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నటి త్రిష కూడా వెబ్ సీరీస్ పట్ల ఆసక్తి చూపుతోంది. తాజాగా ఓ వెబ్ సీరీస్ లో నటించడానికి ఆమె కమిట్ అయినట్టు తెలుస్తోంది. ఆనంద్ వికటన్ సంస్థ నిర్మిస్తున్న ఈ వెబ్ సీరీస్ కి రామ సుబ్రహ్మణ్యన్ దర్శకత్వం వహిస్తారు. తండ్రీ కూతుళ్ల మధ్య నడిచే కథతో భావోద్వేగాల సమ్మిళితంగా ఇది రూపొందుతుందట.