గాల్వన్ లోయ నుంచి చైనా బలగాల ఉపసంహరణకు ముందు అజిత్ దోవల్ ఫోన్ కాల్

06-07-2020 Mon 19:23
  • కిలోమీటరు మేర వెనక్కి వెళ్లిన చైనా బలగాలు
  • గాల్వన్ లోయలో టెంట్లను తొలగించిన వైనం
  • ఏకాభిప్రాయానికి వచ్చిన అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి
Ajit Doval talks to China Foreign Minister

లడఖ్ లోని గాల్వన్ లోయ నుంచి చైనా బలగాలు ఒక కిలోమీటరు మేర వెనక్కి మరలడానికి ముందు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఫోన్ లో మాట్లాడారు. బలగాల ఉపసంహరణ ప్రధాన అజెండాగా ఈ ఫోన్ కాల్ చర్చలు సాగాయి. విభేదాలు వివాదాలుగా మారే అవకాశం ఇవ్వకూడదని ఇరువురు తీర్మానించారు. అంతేకాదు, వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితిని పూర్వ విధానంలోనే పరస్పర గౌరవంతో పరిశీలించాలని నిర్ణయించారు.

ప్రశాంత స్థితికి భంగం కలిగించేలా ఏకపక్ష చర్యలకు తావివ్వరాదని దోవల్, వాంగ్ యీ ఏకాభిప్రాయానికి వచ్చారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నివారణకు ఇప్పటికిప్పుడు బలగాలను వెనక్కి తరలించడం అత్యావశ్యకం అని ఇరువురు అభిప్రాయపడ్డారు. అజిత్ దోవల్ ఫోన్ కాల్ తర్వాత చైనా తన బలగాలను గాల్వన్ లోయ నుంచి వెనక్కి రావాలంటూ ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు, వాస్తవాధీన రేఖ వెంబడి గాల్వన్ లోయలో ఏర్పాటు చేసిన టెంట్లను కూడా తొలగించింది.