సరిహద్దుల నుంచి తమ సైన్యం వెనుదిరగడంపై స్పందించిన చైనా

06-07-2020 Mon 18:57
  • గాల్వన్ లోయ వద్ద టెంట్లను తొలగించిన చైనా సైన్యం
  • తమ సైన్యం సంయమనం సాధించడంలో పురోగతి సాధించిందన్న చైనా
  • భారత్ తమతో కలిసి వస్తుందని ఆకాంక్షిస్తున్నట్టు వెల్లడి
China reacts on de escalation

గత కొన్నివారాలుగా గాల్వన్ లోయ, వాస్తవాధీన రేఖ వెంబడి తిష్టవేసిన చైనా బలగాలు ఎట్టకేలకు వెనుదిరిగాయి. గాల్వన్ లోయ వద్ద ఏర్పాటు చేసుకున్న టెంట్లను తొలగించి ఒక కిలోమీటరు దూరం వెనక్కి వెళ్లాయి. జూన్ 15న జరిగిన ఘర్షణల దరిమిలా ఉద్రిక్తతలు అంతకంతకు పెరిగిపోతుండడంతో చైనా తన బలగాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో చైనా వివరించింది.

చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ స్పందిస్తూ, చైనా సైన్యంలోని ముందు వరుస దళాలు సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు అనుగుణంగా కీలక చర్యలు తీసుకుంటున్నాయని, ఘర్షణలను నివారించే క్రమంలో సంయమనం పాటించడంలో మరింత పురోగతి సాధించాయని వెల్లడించారు. గాల్వన్ లోయ నుంచి చైనా బలగాలు వెనుదిరిగినట్టు వార్తలు వస్తున్నాయి కదా అని మీడియా అడిగినప్పుడు లిజియాన్ పై విధంగా వ్యాఖ్యానించారు.

జూన్ 30న కూడా ఇరుదేశాలు కమాండర్ల స్థాయిలో చర్చలు జరిపాయని, గత చర్చల ద్వారా కుదిరిన ఏకాభిప్రాయాలను మున్ముందు కూడా కొనసాగిస్తాయని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. సరిహద్దుల్లో నెలకొన్న తీవ్ర పరిస్థితులను నివారించేందుకు భారత్ తనవంతుగా పటిష్ట చర్యలతో చైనాతో కలిసివస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు.