కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టనున్న రాంచరణ్!

06-07-2020 Mon 13:55
  • హీరోగా, నిర్మాతగా సక్సెస్ అయిన రాంచరణ్
  • డిజిటల్ రంగం వైపు అడుగులు వేస్తున్న చరణ్
  • వెబ్ సిరీస్ లను నిర్మించేందుకు సిద్ధమవుతున్న మెగా హీరో
Ramcharan entering in to new business

మారుతున్న రోజులకు అనుగుణంగా ఎంటర్ టైన్మెంట్ రంగం కూడా మార్పులకు గురవుతోంది. గతంలో సినీ పరిశ్రమ అంటే సిల్వర్ స్క్రీన్ మాత్రమే. ఆ తర్వాత టెలివిజన్ రంగం అభివృద్ధి చెందాక... సినిమాలు బుల్లితెరపై చూసే వెసులుబాటు వచ్చింది. అయితే, సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా రోజులకు గానీ టీవీలో సినిమాలు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఓటీటీ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. మనం ఇంట్లోనే కూర్చొని... రిలీజ్ సినిమాలను చూసే అవకాశం వచ్చింది.

మరోవైపు, సినిమాలకు దీటుగా డిజిటల్ రంగం దూసుకుపోతోంది. వెబ్ సిరీస్ లు జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ తో పాటు అన్ని ప్రాంతీయ భాషల సినీ నిర్మాతలు, దర్శకులు వెబ్ సిరీస్ లపై ఆసక్తిని కనబరుస్తున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ రాంచరణ్ కూడా డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నారు.

తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోగా కొనసాగుతున్న రాంచరణ్... నిర్మాతగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు తన తండ్రి చిరంజీవితో మాత్రమే ఆయన సినిమాలను నిర్మించారు. ఇప్పుడు తాజాగా నిర్మాతగా మరో రంగంలోకి అడుగుపెడుతున్నారు. వెబ్ సిరీస్ లను నిర్మించాలనే ఆలోచనలో ఆయన వున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై రాంచరణ్ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.