Lockdown: లాక్ డౌన్ లో ఆఫీసు డబ్బు ఖర్చు పెట్టాడని... ఉద్యోగిని చిత్రహింసలు పెట్టిన యజమాని!

  • లాక్ డౌన్ కు ముందు ఢిల్లీ వెళ్లిన ఉద్యోగి
  • అక్కడే హోటల్ లో చిక్కుపోయి అవస్థలు
  • కంపెనీ డబ్బు ఖర్చు చేస్తూ మూడు నెలలు
  • ఇప్పుడు డబ్బు ఇవ్వాలంటూ హింసించిన వైనం
Man Sprays Sanitiser On Employes Genitals

లాక్ డౌన్ సమయంలో అధికంగా ఖర్చు పెట్టాడని ఆరోపిస్తూ, ఆ డబ్బు వెనక్కు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఓ కంపెనీ యజమాని, ఉద్యోగిని కిడ్నాప్ చేసి, దారుణాతి దారుణంగా ప్రవర్తించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది. పౌడ్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం, వివరాల్లోకి వెళితే, కొత్రూడ్ ప్రాంతంలో ఓ వ్యక్తి పలువురు కళాకారులు గీసిన చిత్రాలను ప్రదర్శించే ఏర్పాట్లు చేసే వ్యాపారంలో ఉన్నాడు.

ఓ ఎగ్జిబిషన్ ను ఢిల్లీలో ఏర్పాటు చేసే నిమిత్తం సంస్థలోని ఉద్యోగికి డబ్బిచ్చి, మార్చిలో ఢిల్లీకి పంపాడు. అదే సమయంలో కరోనా మహమ్మారి విస్తృతితో లాక్ డౌన్ ను ప్రకటించగా, అప్పటి నుంచి ఢిల్లీలోని ఓ లాడ్జ్ లో అతను చిక్కుకుపోయాడు. తన వద్ద ఉన్న డబ్బును ఖర్చు పెడుతూ కాలం గడిపి, మే 7న పుణెకు తిరిగి వచ్చాడు. రాగానే అతన్ని క్వారంటైన్ కు పంపగా, తన వద్ద డబ్బులేకపోవడంతో ఫోన్ ను, డెబిట్ కార్డును తాకట్టు పెట్టి కాలం గడిపాడు.

ఆ తరువాత జూన్ 13న ఆఫీసుకు వెళ్లగా, లాక్ డౌన్ సమయంలో ఢిల్లీలో ఖర్చు పెట్టిన డబ్బును వెనక్కు ఇచ్చేయాలని యజమాని డిమాండ్ చేశాడు. తాను ఇవ్వలేనని చెప్పడంతో, మరో ఇద్దరు ఉద్యోగులతో కలిసి కారులో బంధించి తీసుకెళ్లాడు. ఆపై అతన్ని డబ్బు కోసం చిత్ర హింసలకు గురి చేశాడు. అతని జననేంద్రియాలపై శానిటైజర్ స్ప్రే చేశాడు. తనకు డబ్బివ్వకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వుంటుందని హెచ్చరించి వదిలేశాడు.

ఆపై బతుకుజీవుడా అంటూ బయటకు వచ్చిన ఉద్యోగి, ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరి, పోలీసులను అశ్రయించాడు. ఈ విషయంలో ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన పోలీసులు, విచారణను ప్రారంభించారు. విచారణ కొనసాగుతోందని, ప్రస్తుతానికి ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయడలేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

More Telugu News