India: కరోనా దెబ్బతో మూతబడుతున్న స్టార్టప్ కంపెనీలు... ఫిక్కీ సర్వేలో విస్తుపోయే నిజాలు!

Ficci Latest Survey on Indian Startups
  • 17 శాతం కంపెనీలు ఇప్పటికే మూత
  • 43 శాతం కంపెనీల్లో 40 శాతం వరకూ వేతనాల కోత
  • పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాని ఇన్వెస్టర్లు
కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా ఇండియాలో 17 శాతం స్టార్టప్ కంపెనీలు, ఇప్పటికే తమ వ్యాపారాలను, కార్యకలాపాలను మూసివేశాయని ఫిక్కీ (ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) వెల్లడించింది. 70 శాతం స్టార్టప్ లు తమపై కోవిద్-10 ప్రభావం  ఉందని  వెల్లడించాయని ఐఏఎన్ (ఇండియన్ ఏంజిల్ నెట్ వర్క్) సాయంతో ఓ సర్వే చేపట్టిన ఫిక్కీ, తన సర్వే ఫలితాల్లో పేర్కొంది. 60 శాతం కంపెనీలు కొన్ని రకాల సమస్యలు, అవాంతరాల మధ్య తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నామని పేర్కొన్నాయని తెలిపింది.

"ఈ సమయంలో స్టార్టప్ సెక్టారు నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తోంది. పెట్టుబడులు కూడా పెద్దగా రావడం లేదు. మరికొన్ని నెలలు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు ఉన్నాయి" అని ఫిక్కీ సెక్రెటరీ జనరల్ దిలీప్ చినాయ్ వెల్లడించారు. ఎన్నో కంపెనీలు మూలధన నిధుల కొరతతో బాధించబడుతున్నాయని, దీని ఫలితంగా వచ్చే ఆరు నెలల వ్యవధిలో ఎంతో మంది ఉద్యోగులను తొలగించక తప్పనిసరి పరిస్థితి నెలకొనివుందని ఆయన తెలిపారు.

68 శాతం స్టార్టప్ కంపెనీలు తమ నిర్వహణా ఖర్చులను తగ్గించుకున్నామని వెల్లడించగా, 22 శాతం కంపెనీలు తమ వద్ద మరో మూడు నుంచి 6 నెలల కాలానికి సరిపడా నిధులు ఉన్నాయని ఫిక్కీ సర్వేలో వెల్లడించాయి. లాక్ డౌన్ నిబంధనలను ఇదే విధంగా కొనసాగిస్తే, ఉద్యోగులను తొలగించక తప్పదని 30 శాతం కంపెనీలు అభిప్రాయపడగా, 43 శాతం కంపెనీలు తమ ఉద్యోగుల వేతనాల్లో 20 నుంచి 40 శాతం వరకూ కోత విధించామని, ఈ పరిస్థితుల్లో అంతకన్నా మార్గం కనిపించలేదని వెల్లడించాయి.

"ఇటువంటి అనిశ్చిత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లుగా మా బాధ్యత కీలకమని మాకు తెలుసు. ఇదే సమయంలో స్టార్టప్ కంపెనీల్లో కొత్త పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది పెట్టుబడిదారులు భయపడుతున్నారు" అని ఐఏఎన్ అధ్యక్షుడు పద్మజా రూపారెల్ వ్యాఖ్యానించారు.
India
startups
Ficci
Survey

More Telugu News