Kerala: రాష్ట్రంలో ఏడాది పాటు కరోనా నిబంధనలన్నీ తప్పనిసరిగా పాటించాలి: కేరళ ప్రభుత్వం

Kerala Extends Corona Safty Guidelines for another Year
  • మాల్స్ లో 20 మందికే పరిమితం
  • ఇద్దరి మధ్య 6 అడుగుల దూరం తప్పనిసరి
  • పెళ్లి అయితే 50 మంది, అంత్యక్రియలకు 20 మంది మాత్రమే
  • ధర్నాలు, సభలు నిరసనల్లో 10 మందికే అనుమతి
ఒక ఏడాది పాటు రాష్ట్ర ప్రజలందరూ విధిగా కరోనా నిబంధనలను పాటించాల్సిందేనని కేరళ సర్కారు ఆదివారం నాడు ఆదేశాలు జారీచేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ను ధరించడం తప్పనిసరని, ప్రజలంతా భౌతిక దూరాన్ని పాటించాల్సిందేనని పేర్కొంది. ప్రతి ఇద్దరి మధ్యా ఆరు అడుగుల దూరం ఉండాల్సిందేనని, పెళ్లిళ్లకు గరిష్ఠంగా 50 మంది, అంత్యక్రియలకు 20 మంది మాత్రమే హాజరు కావాలని స్పష్టం చేసింది.

సభలు, గెట్ టు గెదర్, ధర్నాలు, నిరసనలకు సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరని, అటువంటి వాటిల్లోనూ 10 మంది కన్నా అధికంగా పాల్గొనేందుకు వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేసింది. మాల్స్ తదితర వాణిజ్య కార్యకలాపాలు జరిగే ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ  20 మందికి మించి ఉండరాదని, అది కూడా ఒక్కొక్కరి మధ్యా 6 అడుగుల దూరం ఉండేంత పెద్ద విస్తీర్ణంలో ఉండాలని పేర్కొంది. బహిరంగ ప్రదేశాలు, రహదారులపై ఉమ్మి వేయడంపై నిషేధం కొనసాగుతుందని వెల్లడించింది.

రాష్ట్రంలో ప్రయాణాలకు అనుమతి ఉంటుందని, అయితే, ప్రయాణాలు చేసేవారు 'జాగ్రత్త' ఈ-ప్లాట్ ఫామ్ లో రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరని పేర్కొంది. కాగా, ఇండియాలో తొలి కరోనా కేసు కేరళలోనే నమోదైన సంగతి తెలిసిందే. అయితే, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కట్టుదిట్టమైన చర్యల కారణంగా కేసుల సంఖ్య పరిమితమైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,204 కేసులు మాత్రమే నమోదు అయ్యాయి.
Kerala
Lockdown
Pinarai Vijayan

More Telugu News