Police: కళ్లు కనిపించకుండా లైట్లు వేసి కాల్చారు... వికాస్ దూబే గ్యాంగ్ ఘాతుకంపై వివరించిన క్షతగాత్రుడు

  • భిక్రు గ్రామంలో పోలీసులపై నేరస్తుల కాల్పులు
  • డీఎస్పీ సహా ఎనిమిది మంది మృతి
  • ఆసుపత్రిలో కోలుకుంటున్న పలువురు పోలీసులు
Injured police describes how they got trapped

ఉత్తరప్రదేశ్ లోని భిక్రు గ్రామం పేరు జాతీయస్థాయిలో వినిపిస్తోంది. ఇటీవల అక్కడ జరిగిన కాల్పుల్లో ఓ డీఎస్పీ, ఎస్ఐ సహా ఎనిమింది మంది పోలీసులు మృత్యువాత పడ్డారు. మరికొందరు తీవ్రగాయాలతో ఆసుపత్రిపాలయ్యారు. కరడుగట్టిన నేరస్తుడు వికాస్ దూబే గ్యాంగ్ ను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులు దారుణమైన రీతిలో మృతి చెందారు. పోలీసులను ట్రాప్ చేసిన వికాస్ దూబే గ్యాంగ్, నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో గాయపడిన బిథూర్ పోలీస్ స్టేషన్ ఎస్సై కౌశలేంద్ర ప్రతాప్ సింగ్ ఓ మీడియా ప్రతినిధికి వివరాలు తెలిపారు.

ఎంతో పకడ్బందీ ప్లాన్ తో తాము బయల్దేరిన విషయం వికాస్ దూబేకు ముందే తెలిసిపోయిందని వెల్లడించారు. "వికాస్ దూబే నుంచి ఈస్థాయిలో ప్రతిఘటన ఉంటుందని మేం ఊహించలేదు. అందుకే పూర్తిస్థాయిలో ఆయుధాలు తీసుకెళ్లలేదు. కానీ వికాస్ దూబే మనుషులు సెమీ ఆటోమేటిక్ ఆయుధాలతో పూర్తి సన్నద్ధంగా ఉన్నారు. కనీసం 15 నుంచి 20 మంది వరకు మాపై కాల్పులు జరిపారు. మేం మా వాహనాలను 250 మీటర్ల అవతలే ఆపేసి కాలినడకన వికాస్ దూబే ఇంటికి చేరుకునేందుకు ప్రయత్నించాం.

అక్కడ రోడ్డుకి అడ్డంగా ఓ జేసీబీ నిలిపారు. దాంతో కేవలం ఒక్కొక్క వ్యక్తి మాత్రమే అవతలికి వెళ్లాల్సి వచ్చింది. మా రాకను ముందే తెలుసుకోవడం వల్ల, వికాస్ దూబే ఇంటి పరిసరాల్లో భారీ లైట్లు ఏర్పాటు చేశారు. ఆ లైట్ల వెలుగు సూటిగా మా కళ్లలో పడే విధంగా అమర్చారు. దాంతో మేం ఎదురుగా ఏం జరుగుతుందో కూడా చూడలేకపోయాం. అదే సమయంలో చుట్టుపక్కల ఉన్న మిద్దెల పైనుంచి వాళ్లు విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. వారు ఎక్కడి నుంచి కాల్చుతున్నారో మాకు కనిపించలేదు, వాళ్లు చీకట్లో ఉంటే, లైట్ల వెలుగులో మేం టార్గెట్లుగా దొరికిపోయాం" అంటూ నాటి కాల్పుల ఘటనను వివరించారు.

More Telugu News