మార్గం ఎలాంటిదైనా ప్రతీకారం కోసం ప్రయత్నిస్తే అక్కడే ఆగిపోతాం: రామ్ చరణ్

05-07-2020 Sun 17:23
  • ద చాయిస్ అనే పుస్తకంలోని వాక్యాలను ప్రస్తావించిన చెర్రీ
  • ప్రతీకారం కోరితే ఎదుగుదల ఉండదని వెల్లడి
  • హింసైనా, అహింసైనా ప్రతీకారం వద్దంటూ పోస్టు
Ram Charan mentions Edith Eva Eger quotations

ఇతర సెలబ్రిటీలతో పోల్చితే రామ్ చరణ్ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం చాలా తక్కువే అని చెప్పాలి. పోస్టుల సంఖ్య తక్కువే అయినా అవెంతో ఆసక్తి కలిగిస్తుంటాయి. తాజాగా అలాంటిదే ఓ పోస్టు చేశారు. "హింస లేదా అహింస... మార్గం ఎలాంటిదైనా గానీ ప్రతీకారం కోరుకుంటే ఉన్నచోటే గిరికీలు కొడుతుంటాం తప్ప, ఎదుగుదల ఉండదు" అంటూ ప్రముఖ రచయిత్రి ఎడిత్ ఇవా ఈగర్ రాసిన 'ద చాయిస్' అనే పుస్తకం నుంచి కొన్ని స్ఫూర్తిదాయక వాక్యాలను ప్రస్తావించారు.

యూరప్ కు చెందిన ఎడిత్ ఇవా ఈగర్ ప్రముఖ సైకాలజిస్టు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో యూదులపై నరమేధం కొనసాగినప్పుడు ఆమె కూడా బాధితురాలే. తన జీవిత అనుభవాలతో రాసిన 'ద చాయిస్' అనే పుస్తకం ఎంతో ప్రజాదరణ పొందింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా అమ్ముడైన పుస్తకాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడీ పుస్తకం నుంచి కొన్ని కొటేషన్లను రామ్ చరణ్ తీసుకున్నారు.