పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంలో విరాట్ కోహ్లీపై ఫిర్యాదు

05-07-2020 Sun 15:21
  • బీసీసీఐకి ఫిర్యాదు చేసిన మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం సభ్యుడు
  • ఓ సంస్థలో డైరెక్టర్ గా కొనసాగుతున్నాడని ఆరోపణ
  • 38 (4) నిబంధనకు వ్యతిరేకమని వివరణ
Kohli in troubles of conflict of interest

టీమిండియా విరాట్ కోహ్లీ చిక్కుల్లో పడ్డట్టు కనిపిస్తోంది. కోహ్లీ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందతున్నాడంటూ మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం శాశ్వత సభ్యుడు సంజీవ్ గుప్తా బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. కోహ్లీ భారత జట్టులో ఆటగాడిగా, కెప్టెన్ గా కొనసాగుతూనే, ఓ స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ కంపెనీకి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడని, కోహ్లీ డైరెక్టర్ గా ఉన్న సదరు స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ కంపెనీ అనేకమంది భారత ఆటగాళ్లతో ఒప్పందాలు కుదుర్చుకుందని ఆరోపించారు.

"కోహ్లీ... విరాట్ కోహ్లీ స్పోర్ట్స్ ఎల్ఎల్ పీ, కార్నర్ స్టోన్ వెంచర్స్ పార్టనర్స్ ఎల్ఎల్ పీ అనే సంస్థల్లో డైరెక్టర్ గా ఉన్నాడు. ఈ రెండు కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్న కొందరు కార్నర్ స్టోన్ స్పోర్ట్ అండ్ ఎంటర్టయిన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మరో సంస్థలో డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ఈ కార్నర్ స్టోన్ స్పోర్ట్ సంస్థ కోహ్లీ వాణిజ్య ప్రకటనలను మేనేజ్ చేయడంతోపాటు ఇతర క్రికెటర్ల ఒప్పందాలను కూడా పర్యవేక్షిస్తోంది" అని సంజీవ్ గుప్తా వివరించారు.

ఇది పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందికి వస్తుందని, బీసీసీఐ రాజ్యాంగంలోని 38 (4) నిబంధనకు వ్యతిరేకమని తెలిపారు. దీనిపై బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నట్టు ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.