కళతప్పిన గురు పౌర్ణమి... బోసిపోయిన ప్రధాన దేవాలయాలు!

05-07-2020 Sun 09:50
  • కరోనా భయంతో కనిపించని భక్తుల సందడి
  • ఆలయాల్లో ప్రత్యేక పూజలన్నీ ఏకాంతమే
  • పరిమితంగా మాత్రమే భక్తులకు అనుమతి
No Piligrims in Temples on Guru Puournami

నేడు ఎన్నో ఆలయాల్లో వైభవంగా జరగాల్సిన గురుపౌర్ణమి వేడుకలు కళతప్పాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ, పలు ఆలయాల్లో కిక్కిరిసిపోవాల్సిన భక్తులు, ఇప్పుడు పదుల సంఖ్యలో కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. ప్రముఖ సాయిబాబా ఆలయాల్లోనూ సందడి కనిపించడం లేదు. షిరిడీలో ప్రధాన పూజారులు పలు సేవలను స్వామికి ఏకాంతంగా జరిపించి, పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతి ఇస్తున్నారు.

బాసరలో సరస్వతీ దేవి అమ్మవారికి ఈ వేకువజామునే పూజారులు ప్రత్యేక పూజలు జరిపించారు. నేడు జరగాల్సిన వేద పండితుల సన్మాన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. పలు ఆలయాల్లో అమ్మవారిని సరస్వతీ దేవి రూపంలో అలంకరించినా, భక్తులను మాత్రం అధిక సంఖ్యలో అనుమతించే పరిస్థితి లేదు. మరోవైపు జన సమూహాల్లోకి వెళితే, వైరస్ ఎక్కడ అంటుకుంటుందో అన్న ఆందోళన సైతం నేడు భక్తులను ఆలయాలకు దూరం చేసింది.