Corona Virus: కరోనా పేషంట్లపై ట్రయల్స్ నిలిపివేస్తూ డబ్ల్యూహెచ్ఓ కీలక నిర్ణయం!

  • డబ్ల్యూహెచ్ఓ ఆధ్వర్యంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ పరీక్షలు
  • హెచ్ఐవీ మందులనూ ట్రయల్స్ లో వాడుతున్న సంస్థ
  • రోగులకు స్వస్థత, మరణాల సంఖ్య తగ్గించడంలో విఫలం
WHO Stopped Trials of HydroxyCholoroquine Trails on Corona Patents

కరోనా రోగులపై మలేరియా డ్రగ్ హైడ్రాక్సీ క్లోరోక్విన్, హెచ్ఐవీకి వాడే లోపినావీర్ / రెటొనావీర్ ను వాడుతూ నిర్వహిస్తున్న ట్రయల్స్ ను నిలిపి వేయాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ డగ్ వాడుతున్న పేషంట్లలో ఏ మాత్రమూ మరణాల రేటు తగ్గకపోవడమే డబ్ల్యూహెచ్ఓ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమని తెలుస్తోంది. కరోనాను పూర్తిగా నయం చేసే విషయంలోనూ ఈ డ్రగ్స్ విఫలమైనట్టు సమాచారం.

"క్లినికల్ ట్రయల్స్ లో మధ్యంతర నివేదికలు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మరియు లోపినావీర్ / రెటోనావీర్ లు ఆసుపత్రుల్లో ఉన్న వారికి ఏ మాత్రమూ స్వస్థతను చేకూర్చలేకపోయాయి. మరణాల శాతాన్నీ తగ్గించలేకపోయాయి. ఇతర ఔషధాలతో పోలిస్తే, ఇవి పెద్దగా ప్రయోజనాన్ని చూపలేదు. దీంతో తక్షణమే ట్రయల్స్ నిలిపివేయాలని నిర్ణయించాం" అని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించినట్టు 'అల్ జజీరా' పేర్కొంది. ఇతర అధ్యయనాలపై ఈ నిర్ణయం ప్రభావం చూపబోదని వెల్లడించింది.

కాగా, గడచిన 24 గంటల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా 2,12,326 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఇదే సమయంలో 4,134 మంది మరణించారని, దీంతో ఇప్పటివరకూ 5,23,011 మంది కరోనా సోకి మరణించినట్లు అయిందని తెలియజేసింది. కాగా, మార్చి 11న కరోనా వైరస్ ను ప్రపంచ మహమ్మారిగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

More Telugu News