India: ఇండియాకు వచ్చేందుకు దుబాయ్ ఎయిర్ పోర్టుకు... మందుకొట్టి నిద్రపోయాడు!

  • తిరువనంతపురం చేరాల్సిన షాజహాన్
  • నిద్రపోవడంతో వెళ్లిపోయిన విమానం
  • వీసా లేకపోవడంతో ఎయిర్ పోర్టులోనే పడిగాపులు
Man Boozed and Sleep at abu Dhabi Airport Missed india Flight

అసలే కరోనా కాలం. అంతర్జాతీయ విమానాశ్రయాలన్నీ మూతబడివున్నాయి. అత్యవసర విమానాలు తప్ప మరేమీ తిరగడం లేదు. ఈ సమయంలో విదేశాల్లో చిక్కుబడిపోయిన వారిని తెచ్చేందుకు పలు విమానయాన సంస్థలు ప్రత్యేక విమానాలు నడిపిస్తున్న వేళ, ఓ వ్యక్తి దుబాయ్ లో మందుకొట్టి, ఇండియాకు వెళ్లే విమానాన్ని మిస్ చేసుకుని నానా ఇబ్బందులూ పడ్డాడు. వివరాల్లోకి వెళితే...

యూఏఈలోని అబూదాబిలో ఓ స్టోర్ కీపర్ గా పనిచేస్తున్న పీ షాజహాన్ అనే వ్యక్తి, అబూదాబి నుంచి తిరువనంతపురానికి వెళుతున్న ఎమిరేట్స్ జంబో జెట్ లో టికెట్ తీసుకున్నాడు. అందుకోసం 1,100 దిర్హామ్ లు (సుమారు రూ. 23 వేలు) కూడా చెల్లించాడు. ఈ విమానాన్ని దుబాయ్ లోని కేరళ ముస్లిం కల్చరల్ సెంటర్ (కేఎంసీసీ) ఏర్పాటు చేసింది. ఈ విమానం ఎక్కేందుకు ఎంతో ముందుగానే విమానాశ్రయానికి వచ్చిన షాజహాన్, తన టికెట్ ను కన్ఫర్మ్ చేయించుకుని, చెకిన్ తరువాత వెయిటింగ్ ఏరియాకు వెళ్లాడు.

ఆపై అక్కడ పూటుగా తాగేసి నిద్రపోయాడు. ఈ విమానానికి సమన్వయకర్తగా ఉన్న ఎస్ నిజాముద్దీన్ కొల్లాం... విమానం వచ్చిన తరువాత, బోర్డింగ్ ముగియగా, షాజహాన్ ఎక్కడో గుర్తించలేకపోయారు. విమానం టేకాఫ్ అయిన చాలా సేపటి తరువాత నిద్రలేచిన షాజహాన్, ఫోన్ చేసి విషయం చెప్పగా, అతన్ని కలిశాడు. అతని వద్ద చెల్లుబాటయ్యే యూఏఈ వీసా లేకపోవడంతో విమానాశ్రయం బయటకు వెళ్లే దారిలేదని గుర్తించి, మరో విమానంలో పంపేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మరో విమానంలో వెళ్లేందుకు టికెట్ డబ్బులు కూడా షాజహాన్ వద్ద లేవు. కేఎంసీసీ ఇచ్చిన స్నాక్స్ తింటూ ప్రస్తుతం ఎయిర్ పోర్టులోనే గడుపుతున్నాడు. కాగా, మార్చిలో ఇండియన్స్ ను తీసుకుని వచ్చేందుకు వెళ్లిన ఓ విమానం ఎక్కాల్సిన మరో భారతీయుడు కూడా ఇదే విధంగా ఎయిర్ పోర్టులో నిద్రపోయి విమానాన్ని మిస్ చేసుకున్న సంగతి గుర్తుండేవుంటుంది.

More Telugu News