Thunderbolts: బీహార్ లో మళ్లీ పిడుగుల బీభత్సం... 23 మంది బలి

  • ఐదు జిల్లాల్లో పిడుగుపాటు
  • అత్యధికంగా భోజ్ పూర్ జిల్లాలో 9 మంది మృతి
  • ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సీఎం నితీశ్ కుమార్ విజ్ఞప్తి
Thunderbolts strikes again in Bihar

ఇటీవలే పిడుగుల ధాటికి బీహార్ లో 83 మంది మరణించిన ఘటన మరువక ముందే మరోసారి పిడుగులు బీభత్సం సృష్టించాయి. ఇవాళ బీహార్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పిడుగుపాటుకు 23 మంది మృత్యువాత పడినట్టు అధికార వర్గాలు తెలిపాయి. మొత్తం ఐదు జిల్లాల్లో పిడుగులు పడ్డాయి. అత్యధికంగా భోజ్ పూర్ జిల్లాలో 9 మంది చనిపోయారు. నిన్న కూడా బీహార్ లో పిడుగులు పడగా 8 మంది బలయ్యారు. మారిన వాతావరణ పరిస్థితుల పట్ల సీఎం నితీశ్ కుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని స్పష్టం చేశారు.

కాగా, బీహార్ లో ప్రస్తుత పరిస్థితికి వాతావరణ మార్పులే కారణమని వాతావరణ నిపుణులు అంటున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, మరోవైపు దక్షిణాది నుంచి బంగాళాఖాతం మీదుగా తేమతో కూడిన గాలులు వీస్తున్నాయని, వీటి కలయిక వల్లే పిడుగులు పడడం వంటి విపరీత వాతావరణ పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయని వివరించారు. గత పక్షం రోజుల్లో బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పిడుగుపాటుకు 150 మంది వరకు మరణించారు.

More Telugu News