Kishan Reddy: కేంద్ర బృందాల సలహాలను పట్టించుకోలేదు..పాలించాల్సిన వారు ఫాంహౌస్ లో ఉంటే ఎలా?: కిషన్ రెడ్డి

  • కరోనాతో హైదరాబాద్ పేలడానికి రెడీగా ఉంది
  • రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతుందనే  భరోసాతో ప్రజలు ఉండరాదు
  • కేసీఆర్, ఒవైసీ కుటుంబాల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి
Hederabad is going to blast with Corona says Owaisi

కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేయడంతో టీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రెండు కేంద్ర బృందాలను పంపి సలహాలు ఇస్తే... రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. అత్యధిక మరణాలు హైదరాబాదులో నమోదవుతున్నాయని చెప్పారు. ఒక ల్యాబ్ లో టెస్ట్ చేసిన వాటిలో 71 శాతం పాజిటివ్ కేసులు వచ్చాయని అన్నారు.

హైదరాబాద్ కరోనాతో పేలడానికి రెడీగా ఉందని కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతుందనే భరోసాతో ప్రజలు ఉండరాదని.. ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు చేసిన సాయాన్నే తెలంగాణకు కూడా కేంద్రం చేసిందని తెలిపారు. రెండున్నర లక్షల పీపీఈ  కిట్లు, ఆరున్నర లక్షల మాస్కులు 22 లక్షల ట్యాబ్లెట్లను రాష్ట్రానికి పంపిందని చెప్పారు. సకాలంలో సరైన నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోవడం లేదని... ఎంఐఎం ఆదేశాల ప్రకారం నడుచుకుంటోందని మండిపడ్డారు.

కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని... ప్రజల్లో భయం పోగొట్టి, వారిలో విశ్వాసాన్ని నింపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కిషన్ రెడ్డి చెప్పారు. కష్టపడటానికి అధికారులు సిద్ధంగా ఉన్నప్పటికీ... ప్రగతి భవన్ లో సరైన నిర్ణయాలను తీసుకోవడం లేదని విమర్శించారు. టెస్టుల కోసం ప్రజలు ఆసుపత్రుల చూట్టూ తిరగాల్సిన పరిస్థితి దాపురించిందని అన్నారు. ఢిల్లీలో 20 లక్షల టెస్టులు చేస్తుంటే... ఇక్కడ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. యుద్ధ ప్రాతిపదికన టెస్టులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

రాష్ట్రాన్ని పరిపాలించాల్సిన వారు ఫాంహౌస్ లో ఉంటే ఎలాగని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో కుటుంబ పాలనకు చెక్ పెట్టాలని అన్నారు. కేసీఆర్, ఒవైసీ కుటుంబాల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల ఆకాంక్షల మేరకు పని చేసే ప్రభుత్వం ఇది కాదని టీఆర్ఎస్ పై మండిపడ్డారు.

More Telugu News