Sitharam Yechuri: కరోనా వ్యాక్సిన్ వ్యవహారంలో ఐసీఎంఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సీతారాం ఏచూరి

  • ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్ తీసుకువస్తామన్న ఐసీఎంఆర్
  • క్లినికల్ ట్రయల్స్ కు ఆదేశాలు
  • ఆదేశాలతో శాస్త్ర పురోగతిని శాసించలేరన్న ఏచూరి
Sitharam Yechuri questions ICMR policy on Corona Vaccine

భారత్ లో ఆగస్టు 15 నాటికి కరోనా వ్యాక్సిన్ తీసుకొస్తున్నామని, అందుకు సన్నాహాలు జరుగుతున్నాయని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించిన సంగతి తెలిసిందే. భారత్ బయోటెక్ సంస్థ భాగస్వామ్యంతో కోవాక్జిన్ పేరుతో వస్తున్న ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం 12 ఆసుపత్రులను కూడా ఎంపిక చేశామని ఐసీఎంఆర్ తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రకటన చేసేందుకే ఈ తొందరపాటు అంటూ దీనిపై విమర్శలు వస్తున్నాయి. వ్యాక్సిన్ తయారీకి గడువు విధించడమేంటని ఐసీఎంఆర్ వైఖరిపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. తాజాగా, సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి దీనిపై తీవ్రస్థాయిలో స్పందించారు.

శాస్త్ర ఆవిష్కరణలను మెడపై కత్తి పెట్టి పొందాలనుకోవడం తగదని స్పష్టం చేశారు. ఈ వైరస్ మహమ్మారి నుంచి ప్రపంచాన్ని కాపాడేది నిర్ణయాత్మక శక్తి వ్యాక్సిన్ మాత్రమేనని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడైనా ఉపయోగించుకునే వీలున్న సురక్షితమైన టీకా కోసం అన్ని దేశాలు ఎదురుచూస్తున్నాయని పేర్కొన్నారు. కానీ శాస్త్రీయ పురోగతిని ఆదేశాలతో శాసించాలనుకోవడం సరైన విధానం కాదని వివరించారు. దేశీయంగా కరోనా నివారణకు దేశీయంగా వ్యాక్సిన్ తయారు చేయాలనుకునే క్రమంలో అన్ని రకాల ఆరోగ్య, భద్రతా ప్రమాణాలను ఉల్లంఘిస్తున్నారని, ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రకటన కోసం మానవ ప్రాణాలను పణంగా పెడుతున్నారని సీతారాం ఏచూరి విమర్శించారు.  

క్లినికల్ ట్రయల్స్ కోసం హైదరాబాద్ నిమ్స్ వంటి ప్రభుత్వ ఆరోగ్య సంస్థలను బెదిరిస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం దీనికి అనుమతి ఇచ్చిందా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా అనేక ప్రశ్నలు కూడా సంధించారు. డీసీజీఐ అనుమతి లేకుండా వ్యాక్సిన్ ఆవిష్కరణ తేదీని ఐసీఎంఆర్ ఎలా నిర్ణయిస్తుందని అడిగారు. ఎథిక్స్ కమిటీల అనుమతి తీసుకునే వ్యవధి ఇవ్వకుండా ఆయా ఆరోగ్య సంస్థలను క్లినికల్ ట్రయల్స్ కు ఎలా ఒప్పిస్తుంది? ఈ క్లినికల్ ట్రయల్స్ లో ఎంతమందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు? 1,2,3వ దశ ప్రయోగాలు ఆగస్టు 14 నాటికి పూర్తయి, వాటి ఫలితాల విశ్లేషణ జరుగుతుందా? అని ప్రశ్నించారు.

More Telugu News