ఈ హత్యలో కొల్లు రవీంద్ర ఓ 'బిగ్ బ్రదర్' లాగా వ్యవహరించారు: ఎస్పీ రవీంద్రనాథ్ బాబు

04-07-2020 Sat 12:56
  • మోకా భాస్కరరావు హత్యకేసులో కొల్లు రవీంద్ర అరెస్ట్
  • మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన పోలీసులు
  • ఈ హత్యకు సంబంధించిన అన్ని వివరాలు కొల్లు రవీంద్రకు తెలుసన్న ఎస్పీ
  • పేరు బయటకు రాకుండా చూడాలని కోరినట్టు వెల్లడి
TDP Kollu Ravindra arrest explains Krishna District police

మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్యకేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లాలో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయవాడ తరలించారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మీడియాకు ఈ కేసు వివరాలు వెల్లడించారు.

ఇదంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు సంబంధించిన వ్యవహారం అని, రాజకీయపరంగా, కులపరంగా ఎదుగుతున్నాడని మోకా భాస్కరరావును చంపారని తెలిపారు. మచిలీపట్నంలో మోకా భాస్కరరావుకు నాంచారయ్య అలియాస్ చిన్నాకు మధ్య ఎన్నో ఏళ్లుగా మనస్పర్ధలు ఉన్నాయని, 2013 నుంచే మోకా భాస్కరావును చంపేందుకు ప్రయత్నాలు జరిగాయని, ఇన్నాళ్లకు అతడిని చంపగలిగారని వివరించారు. ఇందులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పాత్ర గురించి చెబుతూ, నిందితులకు అన్నివిధాలుగా అండగా నిలిచారని, ఓ పెద్దన్న తరహాలో వ్యవహరించారని, తన పేరు బయటికి రాకుండా చూసుకునే ప్రయత్నాలు చేసినా, అరెస్టయిన నిందితులు మొదట ఆయన పేరే చెప్పారని ఎస్పీ వివరించారు.

"ఈ కేసులో ప్రధాన ముద్దాయి నాంచారయ్య అలియాస్ చిన్నా. లోకల్ గా టీడీపీ నేత. మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు ముఖ్య అనుచరుడు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 24వ వార్డు నుంచి పోటీ చేయాలనుకుంటున్నాడు. హత్యకు గురైన మోకా భాస్కరరావు కూడా ఇదే వార్డు నుంచి పోటీలో ఉన్నాడు. ఏడెనిమిదేళ్లుగా ఇద్దరి మధ్య రాజకీయంగానూ, కుల పరంగానూ గొడవలు ఉన్నాయి. అప్పట్లో భాస్కరరావు మీద హత్యాయత్నాలు జరిగినా విజయవంతం కాలేదు. కొన్నాళ్ల కిందట నాంచారయ్య వదిన కౌన్సిలర్ గా గెలవడంతో ఈ వివాదాలు, దాడులు మానుకున్నారు.

అయితే, ఇటీవల కాలంలో ఇద్దరి మధ్య ఆధిపత్యపోరు బాగా ముదిరింది. అనేక కార్యక్రమాలతో మోకా భాస్కరరావుకు రాజకీయవర్గాల్లోనే కాదు, సొంత కులంలోనూ పాప్యులారిటీ మరింత పెరిగింది. దీన్ని నాంచారయ్య వర్గీయులు భరించలేకపోయారు. మోకా భాస్కరరావు బతికుంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని ఆందోళన చెందేవారు. దాంతో అతడ్ని చంపేయాలన్న నిర్ణయానికి వచ్చారు. మూడు, నాలుగు నెలల నుంచి ఇదే పనిలో ఉన్నారు. ఈ వ్యవహారంలో నాంచారయ్య, తదితరులకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఓ బిగ్ బ్రదర్ లా వ్యవహరించారు. ఏదైనా సమస్య వస్తే నాంచారయ్య నేరుగా కొల్లు రవీంద్ర సలహా తీసుకునేవాడు.

ఇటీవల 20 రోజుల ముందు కూడా భాస్కరరావు విషయంలో నాంచారయ్య మాజీమంత్రి కొల్లు రవీంద్రను కలిసి తన బాధను వెళ్లగక్కాడు. అతడుంటే తమకు ఎదిగే మార్గమేలేదని, చంపేస్తామని చెప్పారు. అయితే, అందుకు ఇది తగిన సమయం కాదని కొల్లు రవీంద్ర వారించారు. దాంతో ఆ నిర్ణయం అప్పటికి వాయిదాపడింది. మళ్లీ పది రోజుల కిందట ఇరువర్గాలకు గొడవలు జరగడంతో భాస్కరరావును లేపేయాల్సిందే అని నాంచారయ్య డిసైడ్ చేసుకుని కొల్లు రవీంద్రను కలిశాడు.

ఈ ఇద్దరి మధ్య చర్చలు జరిగిన సమయంలో అక్కడ కొల్లు రవీంద్ర పీఏ కూడా అక్కడే ఉన్నాడు. నాంచారయ్య పట్టుదల చూసి కొల్లు రవీంద్ర కూడా సరేనన్నాడు. తాను అన్ని రకాల సాయం చేస్తానని, తన పేరు ఎక్కడా బయటికి రాకుండా చూడాలని కోరాడు. అంతేకాదు, ప్లాన్ సక్సెస్ అయ్యేలా చూడాలని, మోకా భాస్కరరావు బతికాడంటే మాత్రం అందరినీ చంపేస్తాడు అని కూడా కొల్లు రవీంద్ర వారిని హెచ్చరించాడు. ఇకపై తనకు ఎవరూ నేరుగా ఫోన్ చేయొద్దని, తన పీఏలను సంప్రదిస్తే తాను మాట్లాడతానని కూడా చెప్పాడు.

కొల్లు రవీంద్ర నుంచి భరోసా రావడంతో నాంచారయ్య అతడి అనుచరులు మోకా భాస్కరరావు కదలికలపై నిఘా వేశారు. చేపల మార్కెట్ వద్ద నిర్మాణ పనులు జరుగుతుండడంతో మోకా భాస్కరరావు అక్కడికి వస్తున్నట్టు గుర్తించి మర్డర్ స్కెచ్ వేశారు. నాంచారయ్య తమ బంధువులైన 'పులి' అనే యువకుడిని, మరో మైనర్ ను హత్యకు పురమాయించాడు. వారు అదను చూసి ఆయన్ను పొడిచి చంపారు. ఆ సమయంలో కొల్లు రవీంద్ర కలెక్టరేట్ లో ఉన్నారు. హత్య తర్వాత నాంచారయ్య తన ఫోన్ స్విచాఫ్ చేసి 'పులి' ఫోన్ నుంచి కొల్లు రవీంద్ర పీఏకి కాల్ చేసి సమాచారం అందించాడు. దాంతో రవీంద్ర కలెక్టరేట్ నుంచి కొంత ఎడంగా వచ్చి ఆ ఫోన్ కాల్ మాట్లాడాడు. అంతా అయిపోయిందా... జాగ్రత్తగా పారిపొండి అని సూచించాడు.

 ఈ హత్య గురించి కొల్లు రవీంద్రకు అన్నీ తెలుసు. వాళ్ల ప్రణాళికలో భాగస్వామి కావడమే కాదు, వారికి అన్ని విధాలుగా సహకరించాడు. సాంకేతికపరమైన డేటా పరిశీలించిన తర్వాత, అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే కొల్లు రవీంద్ర ఇందులో నిందితుడు అని నిశ్చయించుకున్నాం. నోటీసులు ఇవ్వాలని పోలీసులు ఆయన నివాసానికి వెళ్లారు. అయితే, అంతకుముందే ఆయన ఇంటి వెనుక గోడదూకి పారిపోయారని తెలిసింది. దాంతో మాకున్న సమాచారం ఆధారంగా పోలీసు బృందాలను గాలింపు కోసం పంపించాం. నిన్న సాయంత్రం తుని వద్ద స్నేహితులతో కలిసి కారులో వెళుతుండగా అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్ కు తరలించాం" అని వివరించారు.