మళ్లీ చెబుతున్నా.. అమరావతి నుంచి రాజధాని అంగుళం కూడా కదలదు: సుజనా చౌదరి

04-07-2020 Sat 11:00
  • రాజధాని అమరావతిలోనే ఉండాలని బీజేపీ తీర్మానం
  • కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుంది
  • పార్టీల కోసమో, వ్యక్తుల కోసమో రైతులు భూములు ఇవ్వలేదు
sujaja chowdary on amaravati

అమరావతి రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ తీరుపై బీజేపీ నేత సుజనా చౌదరి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ ప్రాంతం నుంచి అమరావతి తరలివెళ్లదని చెప్పుకొచ్చారు. 'నేను గతంలో చెప్పాను. మళ్లీ చెబుతున్నా. అమరావతి నుంచి రాజధాని అంగుళం కూడా కదలదు. రాజధాని అమరావతిలోనే ఉండాలని బీజేపీ తీర్మానం చేసిన విషయం అందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుంది' అని చెప్పారు.
 
'200 రోజులుగా మొక్కవోని దీక్షతో ఉద్యమం చేస్తున్న అమరావతి ప్రజలందరికీ మేమంతా మనస్ఫూర్తిగా మద్దతిస్తున్నాము. మీరు ఎలాంటి ఆందోళన చెందవద్దు. ధైర్యంగా ఉండండి. మీకు న్యాయం చేసేందుకు నా శాయశక్తులా కృషి చేస్తాను' అని తెలిపారు.

'పార్టీల కోసమో, వ్యక్తుల కోసమో రైతులు భూములు ఇవ్వలేదు. ప్రభుత్వం నిరంతరంగా ఉంటుంది. పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానిగా అమరావతికి మద్దతిచ్చిన జగన్మోహన్ రెడ్డిగారు సీఎం అయ్యాక మడమ తిప్పడం విచారకరం' అని విమర్శించారు.