యువకుడి ఆఖరి చూపునకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దుర్మరణం

04-07-2020 Sat 08:05
  • చిత్తూరు జిల్లా కలకడ మండలంలో ఘటన
  • తల్లి సంవత్సరీకానికి వెళ్లి వస్తుండగా యువకుడి మృతి
  • సొరకాయలపేట చెరువు కట్ట వద్ద ఆటోను ఢీకొట్టిన లారీ
5 dead in one family died in a Road accident in Chittoor dist

చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడిని కడసారి చూసేందుకు వెళ్లివస్తూ వీరంతా మృత్యువాత పడ్డారు. జిల్లాలోని కలకడ మండలం బాటవారిపల్లె పంచాయతీ పరిధిలోని కొత్తగాండ్లపల్లెకు చెందిన మహేశ్‌బాబు (19) తండ్రితో కలిసి పీలేరులో ఉంటున్నాడు. నిన్న అతడి తల్లి సంవత్సరీకం కావడంతో కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బైక్‌పై సొంతూరు బయలుదేరాడు. కార్యక్రమాలు ముగించుకుని తిరిగి వస్తుండగా కలకడ వద్ద బైక్ అదుపు తప్పి కిందపడి మృతి చెందాడు.

విషయం తెలిసి తిరుపతిలో ఉంటున్న యువకుడి తాతయ్య (అమ్మ తండ్రి) వెంకటరమణ (60), అమ్మమ్మ పార్వతమ్మ (55), వరుసకు అమ్మమ్మ అయ్యే సుజనమ్మ (45), చిన్నమ్మ రెడ్డి గోవర్ధిని (25), బంధువులు దామోదర (35), లీలావతి, పుష్పకుమారి నిన్న సాయంత్రం ఆటోలో పీలేరుకు చేరుకున్నారు. యువకుడి మృతదేహాన్ని చూసిన అనంతరం తిరిగి రాత్రి అదే ఆటోలో కొత్తగాండ్లపల్లెకు బయలుదేరారు.

ఈ క్రమంలో సొరకాయలపేట చెరువు కట్ట వద్ద ఎదురుగా వస్తున్న లారీ వీరి ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటరమణ, పార్వతమ్మ, సుజనమ్మ, రెడ్డి గోవర్ధిని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, వారి బంధువు దామోదర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. తీవ్రంగా గాయపడిన పుష్పకుమారి, లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.