Mumbai: ముంబైకి నేడు అతి భారీ వర్ష సూచన.. రెడ్ అలెర్ట్ జారీ

  • నిన్న కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు అతలాకుతలం
  • స్తంభించిన ట్రాఫిక్.. లోతట్టు ప్రాంతాలు జలమయం
  • తాజా హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తం
Intense rain spell over south Mumbai

ముంబైలో నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముంబై, రత్నగిరి, రాయ్‌గఢ్, పాల్‌గఢ్, థానేలలో నేడు కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరికొన్ని చోట్ల అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. నిన్న ఉదయం కురిసిన వర్షానికి దాదర్, మాతుంగా, వర్లినాకా, లాల్‌బాగ్, కింగ్స్ సర్కిల్, సియోన్, కుర్లా, అంధేరీ త‌దిత‌ర ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో జనజీవనం స్తంభించింది.

హింద్‌మాతా, గోల్డ్ ఈవల్ సహా మరికొన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. మరోవైపు, పలు ప్రాంతాలో చెట్లు విరిగి విద్యుత్ స్తంభాలపై కూలడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. నేడు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికలతో స్పందించిన ప్రభుత్వం అత్యవసర సేవల సిబ్బందిని అప్రమత్తం చేసింది. కాగా, నిన్న ఏకధాటిగా మూడు గంటలపాటు కురిసిన వర్షానికి 157 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

More Telugu News