జగన్ రెడ్డి చెత్త పాలనను ఎండగట్టినందుకు కొల్లు రవీంద్రపై హత్య కేసు పెట్టారు: నారా లోకేశ్

03-07-2020 Fri 15:14
  • జగన్ రాజ్యంలో కాదేదీ కేసుకు అనర్హం అంటూ వ్యంగ్యం
  • బీసీలను అణచివేస్తున్నారంటూ ఆరోపణలు
  • కొల్లు రవీంద్రకు అండగా ఉంటామని వెల్లడి
Nara Lokesh take a dig at CM Jagan and YSRCP government

వైఎస్ జగన్ రాజ్యంలో కాదేదీ కేసుకు అనర్హం అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. పెళ్లికి వెళ్లారని యనమల రామకృష్ణుడిపై కేసు పెట్టారని, అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు నమోదు చేశారని, అచ్చెన్నాయుడిపై అక్రమ కేసు బనాయించారని, బుద్ధా వెంకన్నపై హత్యాయత్నం కేసు పెట్టారని, ప్రభుత్వాన్ని నిలదీసినందుకు పంచుమర్తి అనురాధపై పేటీఎం గ్యాంగ్ దాడి చేస్తోందని లోకేశ్ ట్వీట్ చేశారు.

ఇప్పుడు జగన్ రెడ్డి చెత్త పాలనను, అవినీతిని ఎండగట్టినందుకు కొల్లు రవీంద్రపై హత్య కేసు నమోదు చేశారని ఆరోపించారు. కొల్లు రవీంద్రపై ప్రభుత్వ వేధింపులను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. మరో బీసీ నేతపై వేధింపులు మొదలయ్యాయని, కొల్లు రవీంద్రకు తాము అండగా నిలుస్తామని హ్యాష్ ట్యాగ్ ల రూపంలో లోకేశ్ పేర్కొన్నారు. బంధువర్గానికి రాష్ట్రాన్ని పంచిన జగన్ రెడ్డి బీసీ నాయకత్వాన్ని అణచివేయడమే లక్ష్యంగా కేసులు పెడుతూ, దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.