మీ పరాక్రమం గురించి దేశంలో ఇంటింటా మాట్లాడుకుంటున్నారు: సైనికులతో మోదీ

03-07-2020 Fri 14:35
  • లడఖ్ లో పర్యటించిన ప్రధాని మోదీ
  • సైనికుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం
  • త్రివిధ దళాలు శక్తిమంతం అంటూ వ్యాఖ్యలు
Modi visits Army camp in Ladakh

ప్రధాని నరేంద్ర మోదీ లడఖ్ లో భారత సైన్యాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. సైనికులు దేశ సరిహద్దుల్లో ఉండడం వల్లే దేశం మొత్తం నిశ్చింతగా ఉందని తెలిపారు. వేల సంవత్సరాలుగా భారత్ అనేక దాడులను తిప్పికొట్టిందని, ఇవాళ భారత్ శక్తి, సామర్థ్యాలు అజేయం అని వ్యాఖ్యానించారు.

 ప్రపంచం మొత్తానికి భారత్ శక్తి సామర్థ్యాలు నిరూపించామని అన్నారు. భారత త్రివిధ దళాలు అత్యంత శక్తిమంతం అని పేర్కొన్నారు. లేహ్, లడఖ్, కార్గిల్, సియాచిన్, గాల్వన్ ఎక్కడైనా మన సైనికుల పరాక్రమం నిరూపితమైందని తెలిపారు. ఇవాళ దేశ ప్రజలందరి ఆశీస్సులు సైన్యానికి ఉన్నాయని పేర్కొన్నారు.  బలహీనులు శాంతి పొందలేరని, వీరత్వం ద్వారానే శాంతి లభిస్తుందని అభిప్రాయపడ్డారు.

"మనం బలహీనులం కాదు. వేణుగానంతో ఓలలాడించిన శ్రీకృష్ణుడ్ని ప్రార్థిస్తాం, అదే సమయంలో సుదర్శన చక్రం ధరించి శత్రుసంహారం చేసిన శ్రీకృష్ణుడ్ని కూడా ఆరాధిస్తాం. భారతమాత శత్రువులకు ఇప్పటికే ఆవేశాగ్ని రుచిచూపించారు. మీ సంకల్ప శక్తి హిమాలయాల అంతటి సమున్నతమైంది. యావత్ జాతి మిమ్మల్ని చూసి గర్విస్తోంది" అంటూ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు.