Mudragada Padmanabham: ఆ రోజు మీరు మద్దతు ఇచ్చారు కదా.. ఈ రోజు మా కోరికను ఎందుకు తీర్చలేకపోతున్నారు?: జగన్‌కు ముద్రగడ లేఖ

  • గతంలో మాకు మద్దతిచ్చారు
  • కాపుల రిజర్వేషన్లపై మోదీతో మాట్లాడాలి
  • సీఎం పదవిలో నవీన్‌ పట్నాయక్‌, జ్యోతిబసులా ఉండాలంటే ఇది చేయాలి
  • దయచేసి మా జాతి సమస్య తీర్చాలి
Mudragada Padmanabham Writes Letter To CM Jagan Over Reservations

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ప్రజల కష్టాల్లో పాలకులు పాలుపంచుకోవాలని హితవు పలికారు. తమ జాతి సమస్య తీర్చాలని ప్రధాని మోదీని జగన్‌ కోరాలన్నారు. అడిగిన వారికి, అడగని వారికి, హామీలు ఇవ్వని, ఇచ్చిన వాటికి దానాలు చేసి దానకర్ణుడు అని జగన్‌ అనిపించుకుంటున్నారని, అయితే, తమ జాతి చిరకాల కోరికను నెరవేర్చట్లేదని చెప్పారు.

తమకు బీసీ రిజర్వేషన్‌ల విషయంపై 2016లో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, కాపుల కోరిక సమంజసం అని జగన్ చెప్పారని తన మిత్రులు చెబితే విన్నానని అన్నారు. అసెంబ్లీలో కూడా ఈ విషయంపై జగన్ మద్దతు ఇచ్చారని విన్నానని అన్నారు. ఈ రోజు తమ కోరికను తీర్చడానికి జగన్‌కు ఎందుకు చేతులు రావడం లేదని ప్రశ్నించారు.

ఎన్నికలు జరగకముందు ప్రతి రోజు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తమ జాతిని, ఉద్యమాన్ని అణచివేయడానికి పోలీసులతో చేయించిన దమన కాండ, అరాచకాలు, అవమానాలను వైసీపీ తమ ఛానెల్‌లో చూపించిందే చూపించిందని, తమ జాతి సానుభూతి, ఓట్లు పొందిందని చెప్పారు.

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి జ్యోతిబసు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిలా పూజలందుకోవాలే గానీ, పదవిని మూన్నాళ్ల ముచ్చటగా చేసుకోవద్దని జగన్‌కు సూచించారు. దయచేసి తమజాతి సమస్య తీర్చమని భారత ప్రధాని గౌరవ మోదీ గారిని కోరాలని జగన్‌ను కోరుకుంటున్నానని చెప్పారు.

More Telugu News