తిరుమలలో కలవరం... పూజారులు, సిబ్బంది సహా 10 మందికి కరోనా!

03-07-2020 Fri 10:53
  • జూన్ ఆఖరి వారంలో విధులు నిర్వహించిన వారిలో వైరస్
  • వారి కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం
  • వెల్లడించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
Corona Pandamic in tirumala

ఏడుకొండలపై కరోనా కలవరం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గత నెలలో ఆంక్షల నడుమ దర్శనాలను ప్రారంభించిన తరువాత, స్థానిక బాలాజీ నగర్ లోని ఓ వ్యక్తికి వైరస్ సోకిన సంగతి తెలిసిందే. ఆపై మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన టీటీడీ అధికారులు, దశలవారీగా ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ వారం ప్రారంభంలో తిరుమలలో విధులు నిర్వహిస్తున్న వారి నమూనాలు సేకరించి, పరీక్షలకు పంపారు.

టీటీడీ ఉద్యోగులు, స్వామి కైంకర్యాల్లో పాల్గొనే పూజారులు సహా మొత్తం 10 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. వారందరినీ వెంటనే ఆసుపత్రులకు తరలించి, వారి కుటుంబీకులకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. తిరుమలకు వచ్చే భక్తులందరికీ అలిపిరిలోనే థర్మల్ స్క్రీనింగ్ ను చేస్తున్నామని, జ్వరం లేకుంటేనే కొండపైకి అనుమతిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

ఏ విధమైన కరోనా లక్షణాలున్నా, కొండపైకి రావద్దని భక్తులకు విజ్ఞప్తి చేసిన వైవీ సుబ్బారెడ్డి, తిరుమలలో ఎప్పటికప్పుడు శానిటైజేషన్ ప్రక్రియను చేస్తున్నామని, క్యూలైన్లను నిత్యమూ శుభ్రపరుస్తున్నామని తెలిపారు. టీటీడీ ఉద్యోగులు వారం రోజుల పాటు కొండపైనే ఉండే విధంగా షిఫ్ట్ లలో విధులను వేస్తున్నామని గుర్తు చేసిన ఆయన, గత నెల ఆఖరి వారంలో విధులు నిర్వహించిన వారిలో కొందరికి వైరస్ సోకిందని అన్నారు.