దేశవ్యాప్తంగా సెప్టెంబరు 15 నుంచి కొత్త విద్యాసంవత్సరం మొదలు: ఏఐసీటీఈ

03-07-2020 Fri 09:40
  • సవరించిన అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసిన ఏఐసీటీఈ
  • కొత్త విద్యార్థులకు సెప్టెంబరు 1 నుంచి తరగతులు మొదలు
  • పాత విద్యార్థులకు మాత్రం ఆగస్టు నుంచే
Academic Year in India starts from September

దేశవ్యాప్తంగా వృత్తి విద్య, సాంకేతిక విద్యాసంస్థల విద్యా సంవత్సరం ఈ ఏడాది సెప్టెంబరు 15 నుంచి ప్రారంభం కానున్నట్టు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) పేర్కొంది. ఈ మేరకు సవరించిన అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఫస్టియర్‌లో చేరే విద్యార్థులకు సెప్టెంబరు 1 నుంచి, ఇతర విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభించాలని ఏఐసీటీఈ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ షెడ్యూల్‌ను సవరించి కొత్త అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది.

ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో కొత్తగా చేరే విద్యార్థులకు సెప్టెంబరు 15 నుంచి తరగతులు ప్రారంభించాలని పేర్కొంది. మిగతా విద్యార్థులకు మాత్రం ఆగస్టు 16 నుంచి తరగతులు ప్రారంభించాలని సూచించింది. యూనివర్సిటీల అనుబంధ గుర్తింపును జులై 15 వరకు ఇవ్వనున్నట్టు తెలిపింది. గతంలో దీని గడువు జూన్ 30గా ఉంది. అలాగే,  ఆగస్టు 30లోగా మొదటి దశ, సెప్టెంబర్‌ 10లోగా రెండోదశ కౌన్సెలింగ్‌ పూర్తి చేసి మిగిలిన సీట్లను సెప్టెంబరు 15లోగా పూర్తి చేయాలని ఏఐసీటీఈ పేర్కొంది.