కరోనాపై నా దేశ పోరాటం అద్వితీయం: కిమ్ జాంగ్ ఉన్

03-07-2020 Fri 08:34
  • కరోనా ఉత్తర కొరియాను ఏమీ చేయలేకపోయింది
  • వేలాది మంది ఐసొలేషన్ వెనుక జాతి భద్రతే కారణం
  • పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో కిమ్ జాంగ్ ఉన్
North Korea Fight on Corona is Excellent Says Kim

కరోనా మహమ్మారి విషయంలో ఉత్తర కొరియా ప్రజల పోరాటం అద్వితీయమని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ వ్యాఖ్యానించారు. ఆ దేశ అధికారిక న్యూస్ ఏజన్సీ కేసీఎన్ఏ, ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించింది. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అల్లాడిస్తున్న వేళ, తన దేశాన్ని మాత్రం ఏమీ చేయలేకపోయిందని ఆయన అన్నారు. వర్కర్స్ పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొన్న ఆయన, వైరస్ పైనా, ఆరు నెలల నుంచి సరిహద్దులను మూసివేసిన విషయంపైనా చర్చించారు.

వేలాది మందిని ఐసోలేషన్ లో ఉంచడం వెనుక జాతి భద్రత తమ దృష్టిలో ఉందని వ్యాఖ్యానించిన ఆయన, పార్టీ జనరల్ కమిటీ తీసుకున్న దూరదృష్టి నిర్ణయాలతోనే కరోనాను జయించామని అన్నారు. జాతి యావత్తూ, స్వచ్చందంగా మహమ్మారిపై పోరాడిందని దేశ ప్రజలను ఆయన అభినందించారని కేసీఎన్ఏ పేర్కొంది. ఇప్పటికీ పరిస్థితి పూర్తిగా మారలేదని, గరిష్ఠ అప్రమత్తత అవసరమని కిమ్ జాంగ్ ఉన్ వ్యాఖ్యానించారని పేర్కొంది.