బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూత!

03-07-2020 Fri 08:29
  • తెల్లవారుజామున 2.30 గంటలకు కన్నుమూత
  • గుండెపోటే కారణమన్న ఆసుపత్రి వర్గాలు
  • సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు
Bollywood Choreographer Saroj Khan Passes Away

సీనియర్ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె వయసు 71 సంవత్సరాలు. గత నెల 20న ముంబైలోని గురునానక్ ఆసుపత్రిలో శ్వాస సమస్యలతో చేరిన ఆమె, ఈ తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆమెకు కరోనా సోకలేదని స్పష్టం చేశారు.

బాలీవుడ్ లో మూడు సార్లు జాతీయ అవార్డులను స్వీకరించిన నృత్య దర్శకురాలిగా గుర్తింపు పొందిన ఆమె, పలు సూపర్ హిట్ పాటలకు నృత్యాలు సమకూర్చారు. ఈ తెల్లవారుజామున 2.30 గంటలకు ఆమె ఆసుపత్రిలోనే కన్నుమూశారని సరోజ్ ఖాన్ మేనల్లుడు మనీష్ జగ్వానీ మీడియాకు వెల్లడించారు.

ఇక, తెల్లవారగానే ఈ వార్తను తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, తమ సంతాపాలను సోషల్ మీడియా వేదికగా వెలిబుచ్చుతున్నారు. ఆమె ఓ లెజండరీ నృత్య దర్శకురాలని, ఆమె చేసిన అన్ని సాంగ్స్ తనకు ఇష్టమైనవేనని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. ఆమె మృతి భారత చిత్ర పరిశ్రమకు తీరని లోటని, దాదాపు 2000 పాటలకు పైగా నృత్య దర్శకత్వం వహించిన ఆమె లేని లోటు తీర్చలేనిదని రితీశ్ దేశ్ ముఖ్ అన్నారు. పలువురు ఆమెతో తమకున్న అనుభవాలను పంచుకుంటున్నారు.