India: భారీగా యుద్ధ విమానాలు, ఆయుధ వ్యవస్థల కొనుగోళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

  • చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు
  • రష్యా నుంచి మరిన్ని యుద్ధ విమానాల కొనుగోళ్లకు భారత్ సిద్ధం
  • మరికొన్ని విమానాల ఆధునికీకరణకు మొగ్గు
Indian defence ministry approves to get new ammuniation

చైనాతో సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ భారీ ఎత్తున ఆయుధ సమీకరణ చేపడుతోంది. ఫ్రాన్స్ నుంచి అదనంగా రాఫెల్ యుద్ధ విమానాలు కోరుతున్న భారత్, తాజాగా రష్యా నుంచి యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇటు, దేశీయంగా తయారైన ఆయుధ వ్యవస్థలను కూడా అమ్ములపొదిలో చేర్చుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ పచ్చ జెండా ఊపింది. రూ.38,900 కోట్ల విలువైన యుద్ధ విమానాలు, ఇతర ఆయుధాలు, రక్షణ వ్యవస్థల కొనుగోళ్లకు ఆమోదం తెలిపింది.

రష్యా నుంచి మిగ్-29 ఫైటర్ జెట్ విమానాలు 21, ఎస్ యు-30 ఎంకేఐ యుద్ధ విమానాలు 12 కొనుగోలు చేయనున్నారు. అంతేకాదు, ఇప్పటికే భారత వాయుసేనలో కొనసాగుతున్న 59 మిగ్-29 విమానాలను ఆధునికీకరించే ప్రతిపాదనకు కూడా రక్షణ మంత్రిత్వ శాఖ అంగీకారం తెలిపింది. నేవీ, ఎయిర్ ఫోర్స్ కోసం అస్త్ర మిసైళ్లను కూడా కొనుగోలు చేయనున్నారు. ఇవి డీఆర్డీవో అందించిన సాంకేతిక పరిజ్ఞానంతో దేశీయంగా తయారయ్యాయి.

More Telugu News