మయన్మార్ లో విషాదం... బురదనీటిలో చిక్కుకుని 113 మంది దుర్మరణం

02-07-2020 Thu 16:16
  • మయన్మార్ లో భారీ వర్షాలు
  • గనుల్లో పనిచేస్తున్న కార్మికులపై బురద పంజా
  • మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం!
Huge number of mining workers died in Myanmar

మయన్మార్ లో ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలు పెను విషాదానికి కారణమయ్యాయి. కాచిన్ రాష్ట్రంలోని వర్షాలకు భారీ ప్రమాదం జరగడంతో రంగురాళ్ల గనుల్లో పనిచేస్తున్న కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో 113 మంది మృత్యువాత పడ్డారు. కొండలా పేరుకుపోయిన మైనింగ్ వ్యర్థాలు భారీవర్షం కారణంగా దిగువన ఉన్న సరస్సులో పడ్డాయి. దాంతో సరస్సులోని నీరు ఉప్పొంగి సమీపంలో ఉన్న గనులను ముంచెత్తింది. దాంతో కార్మికులు ఆ బురదనీటిలో ఉక్కిరిబిక్కిరై మృతి చెందారు. ప్రస్తుతం అక్కడ సహాయచర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐదేళ్ల కిందట కూడా కాచిన్ రాష్ట్రంలో ఇలాంటి ప్రమాదమే జరగ్గా వంద మందికిపైగా మరణించారు.