Chandrababu: కేంద్ర సర్కారు ఎప్పటికప్పుడు లాక్‌డౌన్ విధించుకుంటూ వచ్చింది.. రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది: చంద్రబాబు

  • లాక్‌డౌన్‌ పెట్టాక ఏపీకి నిధులు కేటాయించారు
  • కేంద్ర ఆర్థిక మంత్రే ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు
  • వాటిని సద్వినియోగం చేసుకోకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టారు
  • ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదు
chandrababu fires on ap govt

కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు లాక్‌డౌన్‌ విధిస్తూ వచ్చిందని, ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 'లాక్‌డౌన్‌ పెట్టాక ఏపీకి నిధులు కేటాయించామని కేంద్ర ఆర్థిక మంత్రే స్వయంగా చెప్పారు. వాటిని సద్వినియోగం చేసుకోకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టారు' అని చెప్పారు.

'ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేకుండా పోయింది. కరోనా సమస్య పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తే మా పైనే విమర్శలు చేసే పరిస్థితి' అని చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు.

'కుటుంబానికి కనీసం రూ.5 వేల చొప్పున ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా స్పందన లేదు. ప్రజల జీవితాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. కరోనా అనేది ప్రపంచానికే పెద్ద సమస్యగా మారింది. సమస్యను ఎలా ఎదుర్కొని ముందుకువెళ్లాలో ఆలోచించాలి' అని చంద్రబాబు నాయుడు చెప్పారు.

'కావాల్సిన వారికి కావాల్సినవి ఇచ్చుకోవడానికి తప్పుడు విధానాలతో వైసీపీ ముందుకు వెళ్తోంది. అచ్చెన్నాయుడిపై ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరు సరికాదు. నేను కూడా ముఖ్యమంత్రిగా పనిచేశాను.. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను.. ఇప్పటివరకు ఇలాంటి అరాచక పాలన ఎన్నడూ చూడలేదు. ఆపరేషన్ జరిగిన వ్యక్తిని అరెస్టు చేసి నానా రకాలుగా వేధించారు. అనారోగ్యం ఉందని చెప్పినప్పటికీ బలవంతంగా డిశ్చార్జి చేశారు' అని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

'విద్యుత్‌ కొనుగోళ్ల గురించి అడిగితే వ్యక్తిగత దాడులకు దిగారు. ఏపీ ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ అవినీతికి పాల్పడింది. రాజధాని కోసం 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. అన్ని పనులు జరిగాక ప్రభుత్వం రాజధానిని మార్చుతామని చెబుతోంది' అని చంద్రబాబు మండిపడ్డారు. కక్ష తీర్చుకునేందుకు చాలా మందిపై ఏపీ ప్రభుత్వం అక్రమ కేసులను బనాయిస్తోందని ఆయన ఆరోపించారు. 

More Telugu News