Indian Railways: రూ. 30 వేల కోట్లు టార్గెట్... 151 ప్రైవేటు రైళ్లకు ఇండియన్ రైల్వేస్ ఆహ్వానం!

  • 'రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్'లకు ఆహ్వానం
  • నోటిఫికేషన్ విడుదల చేసిన రైల్వే శాఖ
  • దేశవ్యాప్తంగా 109 మార్గాల గుర్తింపు
151 Private Passenger Tains in 109 Routes

ఇండియాలో ప్రైవేటు ప్యాసింజర్ రైళ్లను నడిపించేందుకు మరో అడుగు పడింది. మొత్తం 109 మార్గాల్లో 151 ఆధునిక రైళ్లను నడిపించాలని నిర్ణయించిన ఇండియన్ రైల్వేస్ 'రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్'లను ఆహ్వానిస్తూ, బుధవారం నాడు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్యాసింజర్ రైళ్ల విషయంలో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించడం ఇదే తొలిసారికాగా, దీనిద్వారా రూ. 30 వేల కోట్ల వరకూ ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

కాగా, గత సంవత్సరమే తొలి ప్రైవేటు రైలుగా ఢిల్లీ - లక్నో మార్గంలో తేజస్ ఎక్స్ ప్రెస్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆపై వారణాసి - ఇండోర్ మధ్య కాశి మహాకాళ్ ఎక్స్ ప్రెస్, అహ్మదాబాద్ - ముంబై మార్గంలో మరో తేజస్ ఎక్స్ ప్రెస్ కూడా పట్టాలు ఎక్కాయి. వీటిని ఇండియన్ రైల్వే అండ్ టూరిజం కార్పొరేషన్ నిర్వహిస్తోంది. ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా, ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు దగ్గరవుతాయని రైల్వే శాఖ అంచనా వేస్తోంది.

ఇక, ప్రస్తుతం ఎంపిక చేసిన 109 మార్గాలను 12 క్లస్టర్లుగా విభజించిన రైల్వే శాఖ, ప్రైవేటు పరం చేయనున్న 151 ఆధునిక రైళ్లలో, ఒక్కోదానికి 16 కోచ్ లు ఉంటాయని, గరిష్ఠంగా 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని అధికారులు వెల్లడించారు. ఈ రైళ్లలో అత్యధికం ఇండియాలో తయారు చేస్తారని అన్నారు.

More Telugu News