India: నేను అధ్యక్షుడిగా గెలిస్తే... ఇండియాకు జో బిడెన్ ఇచ్చిన హామీ ఇది!

  • నా పాలనతో ఇండియాకు అధిక ప్రాధాన్యం
  • సహజ భాగస్వామిగా చేసుకుంటాను
  • ఇరు దేశాలకూ లాభం కలిగించేలా నిర్ణయాలు
  • ఓ ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో జో బిడెన్
If i Elected India is my Naturel Partner says Joe Bidden

ఈ నవంబర్ లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే, ఇండియాకు తన పాలనలో అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని, తమ సహజ భాగస్వామిగా ఇండియాను చేసుకుంటామని, ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేస్తానని డెమోక్రాట్ల అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ వ్యాఖ్యానించారు.

 "ఇండియాకు ఓ బలమైన భాగస్వామి కావాలి. ఆ భాగస్వామ్యం అమెరికాకూ రక్షణ కల్పిస్తుంది. వారికి కూడా లబ్దిని చేకూరుస్తుంది" అని అన్నారు. తాజాగా, నిధుల సమీకరణ నిమిత్తం జరిగిన వర్చ్యువల్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, భారత్ - యూఎస్ సంబంధాలపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

ఈ కార్యక్రమాన్ని బెకాన్ కాపిటల్ పార్ట్ నర్స్ చైర్మన్ అలెన్ లివెంథాల్ ఏర్పాటు చేశారు. "మన భద్రతకు ఇండియాలో స్నేహం, వ్యూహాత్మక భాగస్వామ్యం తప్పనిసరి" అని బిడెన్ వ్యాఖ్యానించారు. తాను ఎనిమిది సంవత్సరాలుగా ఉపాధ్యక్షుడిగా పనిచేసిన కాలాన్ని ప్రస్తావించిన ఆయన, అప్పట్లో భారత్ తో పౌర అణు ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని, ఇది చాలా పెద్ద డీల్ అని తాను గర్వంగా చెప్పగలనని అన్నారు. నాడు ఒబామా - బిడెన్ ల పానలో ఏం జరిగిందో, తాను గెలిస్తే, మరోసారి అటువంటి సంబంధాలే ఇండియాతో ఉంటాయని అన్నారు.

కాగా, ప్రస్తుతం డెలావర్ సెనెటర్ గా ఉన్న బిడెన్ ఇండియా - యూఎస్ సంబంధాలకు మంచి మద్దతు ఇచ్చే వ్యక్తిగా ఆది నుంచి పేరు తెచ్చుకున్నారు. తన గెలుపునకు భారత సంతతి ఓటర్ల మద్దతు కూడా అవసరమని భావిస్తున్న ఆయన, వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చాలా రోజుల క్రితమే ప్రారంభించారు. అమెరికా తన ఆత్మను రక్షించుకోవాల్సిన అవసరమున్న ఈ పరిస్థితుల్లో జరుగుతున్న ఎన్నికలు జాతి భవిష్యత్తుకు అత్యంత కీలకమని తన ప్రసంగంలో బిడెన్ వ్యాఖ్యానించారు.

"ఎన్ని హెచ్చరికలు వచ్చినా ట్రంప్ పట్టించుకోలేదు. దేశాన్ని కాపాడేందుకు ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదు. కేవలం ఇప్పుడు మాత్రమే కాదు. ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి ఇదే పరిస్థితి. అమెరికా ఆర్థిక మూలాలు కుదేలవుతున్నాయి. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉంది" అని ఆయన అన్నారు. ప్రస్తుతం అమెరికా సరైన నాయకత్వం లేక అలమటిస్తోందని, దేశానికి చికిత్స చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించిన ఆయన, మరింత మెరుగైన భవిష్యత్తు ప్రజల కోసం వేచి చూస్తోందని అన్నారు.

More Telugu News