America: టిక్‌టాక్‌పై నిషేధం విధించిన భారత్‌కు మద్దతు.. అమెరికాలోనూ నిషేధించాలని డిమాండ్

  • అమెరికాలో టిక్‌టాక్‌ను ఉపయోగిస్తున్న నాలుగు కోట్ల మంది
  • ఇప్పటికే దీనిని నిషేధించి ఉండాల్సిందన్న రిపబ్లికన్లు
  • పెండింగులో రెండు బిల్లులు
America backs India on TikTok ban

టిక్‌టాక్ యాప్‌ను భారత్ నిషేధించిన తర్వాత అమెరికాలోనూ దీనిని నిషేధించాలంటూ అక్కడి ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఈ యాప్ దేశ భద్రతకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని, కాబట్టి వీలైనంత త్వరగా దీనిని నిషేధించాలని కోరుతున్నారు. టిక్‌టాక్ యాప్‌ను నిషేధించిన భారత్‌కు మద్దతుగా సెనేటర్ జాన్ కోర్నిన్ ట్వీట్ చేయగా, అమెరికా ఇప్పటికే దీనిని నిషేధించి ఉండాల్సిందని రిపబ్లికన్ ప్రతినిధి రిక్ క్రాఫోర్డ్ అభిప్రాయపడ్డారు. కాగా, అమెరికాలో నాలుగు కోట్ల మంది టిక్‌టాక్‌ను వాడుతున్నారు. వీరిలో ఎవరైనా చైనా అధికారిక కమ్యూనిస్టు పార్టీపై వ్యాఖ్యలు చేస్తే యాప్ అసంకల్పితంగానే దానిని డిలీట్ చేస్తోందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఒబ్రెయిన్ పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు టిక్‌టాక్ వాడకాన్ని నిషేధించాలటూ రూపొందించిన రెండు బిల్లులు అమెరికన్ కాంగ్రెస్‌లో పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపారు. ఈ యాప్‌ను నిషేధించాలన్న డిమాండ్‌ను అమెరికా అధ్యక్షుడి వాణిజ్య వ్యవహారాల సలహాదారు పీటర్‌ నవరో కూడా సమర్థించడం గమనార్హం.

More Telugu News