రామోజీరావుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన శ్రీకాంత్ రెడ్డి

01-07-2020 Wed 15:48
  • కరోనా సంక్షోభ సమయంలో కూడా ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది
  • రామోజీరావు ధృతరాష్ట్రుడిలా కళ్లు మూసుకోవద్దు
  • జగన్ ప్రజాదరణ ముందు టీడీపీ మట్టికొట్టుకుపోతుంది
YSRCP leader Srikanth Reddy criticises Ramoji Rao
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుపై వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కులం, మతం చూడకుండా తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని... మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేస్తోందని చెప్పారు. అయినా రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలను చూడకుండా ఈనాడులో వార్తలు వస్తున్నాయని దుయ్యబట్టారు.

రామోజీరావు వాస్తవాలను తెలుసుకోవాలని... ధృతరాష్ట్రుడిలా కళ్లు మూసుకోవద్దని హితవు పలికారు. కరోనా విషయంలో ఏపీకి సంబంధించి ఒకలా, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి మరోలా ఈనాడులో వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. ఈనాడు, ఎల్లో మీడియా కలిసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు. కరోనా సమయంలో కూడా ప్రజల శ్రేయస్సు కోసం ఆరు నెలల్లో రూ.28,122 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.

జగన్ పాలనను చూసి టీడీపీ నేతలు అసూయ పడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం నెలకొన్న క్లిష్ట సమయంలో కూడా ప్రభుత్వంపై అసత్యాలను ప్రచారం చేయడం దారుణమని చెప్పారు. 108 వాహనాలను అందుబాటులోకి తీసుకురావడంపై ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. 108, 104లను పూర్తిగా నిర్వీర్యం చేసిన టీడీపీ... ఇప్పుడు 108 వాహనాల్లో రూ. 300 కోట్ల అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 108 వాహనాల కొనుగోళ్లు, నిర్వహణ అంతా పారదర్శకంగా ఉందని చెప్పారు. జగన్ ప్రజాదరణ ముందు టీడీపీ మట్టికొట్టుకొనిపోతుందని అన్నారు.