Jagan: ఏపీ వైద్య చరిత్రలో మైలురాయి... ఒకేసారి 1088 అంబులెన్స్ లను ప్రారంభించిన వైఎస్ జగన్!

  • ఈ ఉదయం విజయవాడలో ప్రారంభం
  • పచ్చజెండా ఊపిన వైఎస్ జగన్
  • పాల్గొన్న పలువురు మంత్రులు
Jagan Inaugurates 1008 Ambulences

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య చరిత్రలో మరో మైలురాయి ఇది. నూతనంగా అందుబాటులోకి తెచ్చిన అత్యాధునిక అంబులెన్స్ లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఉదయం ప్రారంభించారు. అత్యవసర వైద్య సేవలను అందించేందుకు 1088 అంబులెన్స్ లను కొనుగోలు చేసిన ఏపీ సర్కారు, వాటిని రాష్ట్రంలోని ప్రతి మండలానికి పంపుతామని వెల్లడించింది. ఈ ఉదయం విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద జగన్ పచ్చజెండా ఊపి అన్ని వాహనాలనూ ఒకేసారి ప్రారంభించారు.



ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ, తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఆరోగ్య శ్రీ పథకాన్ని ఇప్పుడు మరింతగా విస్తరించామని, 95 శాతానికి పైగా కుటుంబాలకు ఆరోగ్య భద్రతపై భరోసాను కల్పించామని అన్నారు. ఈ అంబులెన్స్ ల ద్వారా 108, 104 సేవలు ప్రతి ఒక్కరికీ దగ్గరవుతాయని తెలిపారు. 412 అంబులెన్స్ లు 108 సేవల్లో భాగంగా అనారోగ్యానికి గురైన వారిని, ప్రమాదాలకు గురైన వారిని ఆసుపత్రులకు చేరుస్తాయని, మరో 282 అంబులెన్స్ లు బేసిక్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ను కలిగివుంటాయని, మిగతావి అడ్వాన్డ్స్ లైఫ్ సపోర్టుతో ఉంటాయని జగన్ పేర్కొన్నారు.మరో 26 అంబులెన్స్ లు చిన్నారుల కోసం నియో నేటల్ వైద్య సేవల నిమిత్తం కేటాయించామని, వీటితో పాటు ఇన్ క్యుబేటర్, వెంటిలేటర్లతో కూడిన అంబులెన్స్ లు కూడా ఉన్నాయని తెలిపారు. గతంలో ప్రతి 1,19,545 మందికి ఒక అంబులెన్స్ ఉండగా, ఇప్పుడు 74,609 మందికి ఒక అంబులెన్స్ ను అందుబాటులోకి తెచ్చామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆళ్ల నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

More Telugu News