India: మూడేళ్ల నాడు చైనాకు షాకిచ్చిన ఇండియా... తాజా ఘర్షణలకు నాడే బీజం పడిందన్న చైనా నిపుణురాలు!

  • 2017 డోక్లాం వివాదంతో మొదలు
  • ఇండియా సవాలు చేస్తుందని ఊహించలేకపోయిన చైనా
  • భారత్ వెన్నుపోటు పొడిచిందన్న భావన
  • ప్రస్తుతం చైనాను అసాధారణ స్థితిలోకి నెట్టిన ఇండియా
China Thought India is Challenging

భారత్, చైనా సరిహద్దుల మధ్య ఇటీవల చోటుచేసుకున్న గొడవలకు మూడేళ్ల నాడే బీజం పడిందని చైనా ఎక్స్ పర్ట్, యూఎస్ లోని స్టిమ్సన్ సెంటర్ లో తూర్పు ఆసియా ప్రోగ్రామ్ సహ డైరెక్టర్ గా విధుల్లో ఉన్న యన్ సన్ తెలిపారు. తాజాగా, ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

2017లో ఇండియా - చైనా - భూటాన్ ట్రై జంక్షన్ ప్రాంతంలో చైనా రహదారిని నిర్మిస్తుండగా, భారత్ అడ్డుకున్న సంగతి తెలిసిందే. భారత్ తమను సవాలు చేయడం ఏంటని చైనా నాడు ఆశ్చర్యపోయిందని, అప్పటి నుంచి తన వ్యూహాన్ని మార్చుకున్నదని ఆమె తెలిపారు. ఇండియా తమను వ్యతిరేకిస్తుందని, దాదాపు 70 రోజులకు పైగా వివాదం కొనసాగుతుందని చైనా ఊహించలేదని యన్ సన్ వ్యాఖ్యానించారు. భూటాన్ కు దగ్గర్లోని బంజరు భూమిలో తమ నిర్మాణాలను ఇండియా వ్యతిరేకించడంతో చైనా షాక్ నకు గురైందని ఆమె అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం వివాదం కొనసాగుతున్న ఎల్ఏసీకి ఇరువైపులా ఉన్న ప్రాంతాలపై ఆధిపత్యం కోసం ఎన్నో ఏళ్లుగా వివాదాలు ఉన్నాయని గుర్తు చేసిన ఆమె, సరిహద్దుల్లో భారత్ కార్యకలాపాలపై స్పందించాలని చైనా భావించి వుండవచ్చని అన్నారు. భారత్ చర్యలు చైనాకు అంగీకారం కాదని చైనా అధికారులు అంటున్నారని తెలిపారు. ఇక తమ భూ భాగంలో భారత్ నిర్మాణాలు చేపడితే, ఎలా స్పందించాలన్నది చైనా ఇష్టమని, తమను ఇండియా వెన్నుపోటు పొడిచిందని చైనీయులు భావిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం చైనాను ఓ అసాధారణ స్థితిలోకి భారత్ నెడుతోందని, ఈ విషయంలో చైనా దూకుడుగా వ్యవహరించి ఇండియాపై దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంటుందో, లేక ఏమీ చేయకుండా సరిహద్దుల్లో భూమిని వదులు కుంటుందో చూడాలని యన్ సన్ అన్నారు.

More Telugu News