Congress: అనారోగ్యంతో మరణించిన గిరిజన మహిళ.. అంత్యక్రియలకు డబ్బుల్లేక మృతదేహాన్ని నదిలోకి విసిరేసిన వైనం!

  • వీడియో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి
  • దురదృష్టకర ఘటనగా పేర్కొన్న అదనపు కలెక్టర్
  • శివరాజ్ సింగ్ ప్రభుత్వంపై విరుచుకుపడిన కాంగ్రెస్
womens body dumped into river in Madhyapradesh

మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన ఒకటి జరిగింది. ఓ గిరిజన మహిళ అనారోగ్యంతో మరణించగా, ఆమెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు అవసరమైన డబ్బుల్లేక మృతదేహాన్ని నదిలోకి విసిరేశారు. ఆదివారం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిధీ జిల్లాకు చెందిన గిరిజన మహిళ నెల రోజుల క్రితం అనారోగ్యం బారినపడింది. నాలుగు రోజుల క్రితం ఆమెను ఎడ్లబండిలో జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్టు నిర్ధారించారు.

దీంతో బోరుమన్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ కోసం ప్రయత్నించారు. అయితే, ఆదివారం కాబట్టి అంబులెన్స్ సమకూర్చలేమని మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు చెప్పేశారు. దీంతో ఎడ్లబండిపైనే తిరిగి మృతదేహాన్ని తీసుకుని బయలుదేరారు. అయితే, దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో వెళ్తూవెళ్తూ సోన్ నదిలోకి మృతదేహాన్ని విసిరేశారు. దారినవెళ్తున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.

విషయం తెలిసిన సిధీ జిల్లా అదనపు కలెక్టర్ డీపీ బర్మాన్ స్పందించారు. ఇది చాలా దురదృష్టకర ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాలను దహనం చేసేందుకు ప్రభుత్వ పథకం ఉందని తెలియక వారు అలా చేసి ఉంటారని పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు చెప్పారు.  

కాగా, ఈ ఘటనపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. శివరాజ్ సింగ్ ప్రభుత్వంపై విరుచుకుపడింది. గిరిజన మహిళ మృతదేహం నదిలో ఎందుకు తేలాల్సి వచ్చిందో చెప్పాలని మాజీ సీఎం కమల్ ‌నాథ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ విమర్శలను బీజేపీ కొట్టిపారేసింది. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడొద్దని బీజేపీ నేత డాక్టర్ హితేశ్ బాజ్‌పాయ్ హితవు పలికారు.

More Telugu News